భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ

దిశ దశ, భద్రాచలం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద వరద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరగడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం రాత్రి 8.43 నిమిషాలకు భద్రాచలం వద్ద వరద నీరు 53 ఫీట్లకు చేరుకోగానే అధికారులు మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

అప్రమత్తంగా అధికారులు…

గోదావరిలో నీటిమట్ట పెరిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న అధికారులు రెండు రోజుల క్రితం నుండే పరివాహక ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించడంతో చర్ల మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వారిని రెండు రోజుల క్రితమే పునరావాస కేంద్రాలకు తరలించారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీల నేతృత్వంలో పరివాహక ప్రాంతంలోనే పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం రాత్రి వరకు నీటిమట్టం 53 ఫీట్లకు పెరుగుతుందన్న సమాచారం అందుకోవడంతో చాలా వరకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ సర్విసెస్ కోసం ముందుగానే హెలిక్యాప్టర్ ను కూడా అందుబాటులో ఉంచారు. అయితే గోదావరి నీటిమట్టం మరింత ఎక్కువగా పెరిగితే మాత్రం పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం 53.20 ఫీట్లకు నీటి మట్టం చేరుకోగా, 14,32,336 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే ఎగువ ప్రాంతాల నుండి కూడా ఇంతే మొత్తంలో నీరు భద్రాచలానికి వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల మీదుగా వచ్చే వరద ఉధృతి పెరెగినట్టయితే భద్రాచలం వద్ద నీటిమట్ట మరింత పెరగనుంది.

You cannot copy content of this page