జగిత్యాల జిల్లాలో దాడులు
101 పాసుపోర్టుల స్వాధీనం
దిశ దశ, జగిత్యాల:
విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్తూ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ జనాలను నిండా ముంచుతున్న నకిలీ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝులిపించడం ప్రారంభించారు. ఇటీవల జగిత్యాల పట్టణానికి చెందిన ఓ ఏజెంట్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసుకుని పరార్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ ఏజెంట్లపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా పోలీసులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని 15 ట్రావెల్స్, 36 ఏజెన్సీలపై దాడులు చేసిన పోలీసులు మొత్తం 101 పాసుపోర్టులను, 300 డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎగ్గడి భాస్కర్ ఓ ప్రకటన విడుదల చేస్తూ… అనుమతులు లేకుండా ఏజెంట్ల అవతారం ఎత్తిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి వద్ద నిభందనలకు విరుద్దంగా అడ్డగోలు డబ్బులు వసూలు చేసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులు కూడా ఏజెంట్లను ఆశ్రయించేప్పుడు వారికి ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అన్న విషయం కూడా తెలుసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రధానంగా లైసెన్స్ ఉన్న ఏజెంట్లు కూడా విదేశాలకు వెల్లే అభ్యర్థుల నుండి సంబంధిత డాక్యూమెంట్ల నఖల్లు మాత్రమే తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్ తీసుకోకూడదని వెల్లడించారు. ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ (పీఓఈ) ద్వారా ఏజెన్సీలు ఒప్పందం చేసుకున్న తరువాతే ఉపాధి అవకాశాల గురించి తెలియజేయాల్సి ఉంటుందని ఎస్పీ వివరించారు. విదేశీ కంపెనీలు ఇచ్చే ఆఫర్ లెటర్స్ లో పూర్తి వివరాలు స్పష్టంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాల్సని అవసరం ఉందని, అనుథరైజ్డ్ పర్సన్స్ కు పాస్ పోర్టు ఫోటోలు కూడా ఇవ్వకూడదని ఎస్పీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. టూరిస్ట్, విజిటింగ్ వీసాల పేరిట విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేసే వారిని తాము వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.