దిశ దశ, ముంబాయి:
వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తులు ఏకదంతుడిని పూజించేందుకు తమ ప్రత్యేకతలను చాటుకోవడం కామన్. వివిధ రూపాలలో విఘ్నేశ్వరుని ప్రతిమలను తయారు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు చేయడమూ సాధారణమే. అయితే మహారాష్ట్రలోని ముంబాయి మహానగరంలో మాత్రం వైవిద్యంగా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి పూజలు అందిస్తుంటారు. బహుష దేశంలోనే అత్యంత ఖరీదైన గణనాథుడు ఇక్కడే వెలిసి ఉండొచ్చు కూడా. మెరిసేపోయే వర్ణాలతో ఆ ప్రతిమను తయారు చేయలేదు. బంగారు వర్ణంలో కాదు బంగారంతోనే గౌరి తనయుడి విగ్రహాన్ని తయారు చేశారు. దేశ వాణిజ్య రాజధానిగా వాసికెక్కిన ముంబాయి నగరంలో ఏటా ఈ విధంగా వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేసే ఆనవాయితీ కొనసాగుతోంది. జీఎస్ బి సేవా మండల్ ఆద్వర్యంలో కింగ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం కోసం 69 కిలోల బంగారం, 336 కిలోల వెండిని వినియోగించారు. వారణాశిలోని శ్రీ కాశీ మఠ్ సంస్థాన్ ధర్మపీఠంతో అనుసంధానంగా ఉన్న జీఎస్ బి సేవా మండల్ నిర్వహాకులు ఈ ప్రతిమను తయారు చేయించారు. గత సంవత్సరం ఈ విఘ్నేశ్వర మంటపం కోసం 316.4 కోట్ల ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా ప్రిమీయం చెల్లించారు. ఇందులో రూ. 31.97 కోట్ల విలువైన బంగారం, వెండితో పాటు ఇతరాత్ర విలువైన వాటికి కూడా ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా నిర్వహాకులు పాలసీ చేయించారు. ఈ ఏడాది ఇంతకన్నా ఎక్కువకే ఇన్సూరెన్స్ చేసిఉంటారని తెలుస్తోంది. అయితే సంబంధిత సంస్థ నిర్వాహకులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
https://twitter.com/aham_yogini/status/1703441183970611252?t=j9wLs7yVDO3yIP7QU1F92g&s=19