కాలగర్భంలో కలిసిపోయిన వృక్షం
దిశ దశ, సినిమా:
సినిమా షూటింగ్ అనగానే చాలా మంది కూడా ఆకర్షణీయంగా తయారు చేసే సెట్టింగులను చూసి మైమరిచిపోతుంటారు. గ్రాఫిక్స్ డిజైనింగ్ తో కొత్త పుంతలు తొక్కుతున్న నేటి తరానికి ఈ విషయం తెలియకపోవచ్చు… సహజంగానే ఎదిగిన ఓ చెట్టు కొన్ని సినిమాలకు జీవం పోసిందని చాలా మందికి తెలియకపోవచ్చు. సాంకేతికతలో క్రియేటివిటీని చూపిస్తున్న ప్రస్తుత తరానికి ఒకప్పడు మూవీలు తీసే వారికి చాలా తేడా అనే చెప్పాలి. ఆ కాలంలో సినిమాలు తీయాలంటే నేచురాలిటీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు దర్శక నిర్మాతలు. వెండి తెరపైకి ఎక్కించే మూవీలో సహజ సిద్దంగా ఉన్న వనరులను ఏరి కోరి మరి ఎంచుకునే వారు. అయితే నాటి తరం తీసిన చాలా చిత్రాలను తన ఒడిలో దాచుకున్న చెట్టు చరిత్రే ఇది… గౌతమి, గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ చెట్టు… పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండేది. ఇక్కడి గోదావరి తీరంలో శతాబ్దానికి క్రితం నిద్ర గన్నేరు చెట్టును నాటారు సింగలూరి తాతబ్బాయి. క్రమక్రమంగా ఎదిగిన ఈ చెట్టు ప్రకృతి బీభత్సాలను కూడా తట్టుకుంటూ సిని పరిశ్రమను చెట్టంతా ఎదిగేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. నిద్ర గన్నేరు చెట్టే అయినా సిని రంగానికి ఊతమిచ్చిన దీనికి మాత్రం సినిమా చెట్టుగానే పేరు పడిపోయింది.
ఎన్నెన్నో సినిమాలు…
ఈ సినిమా చెట్టు కింద వందకు పైగా మూవీల షూటింగ్ జరిగిందంటే ఆశ్చర్యపోకమానరు… పాడిపంటలు, దేవత, వంశవృక్షం, బొబ్బిలి రాజా, హిమ్మత్ వాలా, సీతారామయ్యగారి మనవరాలు ఇలా చెప్పుకుంటే… ఒకటి కాదు రెండు కాదు 120 సినిమాల షూటింగ్ జరిగింది చెట్టు వద్ద. కెమేరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేము దానంతటదే వచ్చేస్తుందన్న నమ్మకంతో ఉండేవారట సినిమా పరిశ్రమకు చెందిన వారు. అంతేకాకుండా ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీసినా చాలు సినిమా సూపర్ హిట్టు అవడం ఖాయం అన్న సెంటిమెంటు కూడా ఉండేది సిని పరిశ్రమకు చెందిన ప్రముఖులకు. దర్శకుడు వంశీ సినిమాలో ఒక్క సారైనా దర్శనమిచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దాసరి, హస్మబ్రహ్మ జంధ్యాల, ఇవివిలాంటి గొప్ప డైరక్టర్లంతా ఈ చెట్టుపైనే కెమెరాలను ఫోకస్ పెట్టించిన వారే. 145 ఏళ్లనాటి ఈ సినిమా చెట్టు వద్ద 120కి పైగా సినిమాల చిత్రీకరణ జరిగాయి. వంశీ దర్శకత్వం చేసిన 18 చిత్రాల్లోనూ ఈ చెట్టు కనిపించకుండా ఉండదు. 1974 లో వచ్చిన పాడిపంటలు చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి పాటతో టాలివుడ్ సిని పరిశ్రమ అనుబంధం, సీతా రామయ్య గారి మనవరాలులో సమయానికి… గోదావరిలో ఉప్పొంగేలే గోదావరి… లాంటి పాటలు… ఎన్నెన్నో ఇక్కడ షూటింగ్ చేసినవే. ప్రస్తుత దర్శకులు ఆర్టిఫిషియాలిటీతో పాటు విదేశాలపై మక్కువ పెంచుకోవడంతో వెండితెరపైకి కనిపించకుండా పోగా… తాజాగా నేలవాలిన ఈ చెట్టు కాలగర్భంలో కలిసిపోయింది. ఏది ఏమైనా కోట్ల రూపాయలు వెచ్చించి తీసే సినిమాల్లో ఒకే చెట్టు వందల సినిమాల్లో కనిపించినా నాటి తరం మాత్రం అస్వాదించారే తప్ప అసహ్యించుకోలేదు. సిని పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ చెట్టు వద్ద షూటింగ్ చేయడానికి ఎంతో ఆసక్తిని చూపేవారు. అంతటి చరితను తనలో దాచుకున్న ఈ సినిమా చెట్టు అటు సినీ రంగానికి, ఇటు సినీ అభిమానులకు ప్రత్యక్ష్యంగా కనిపించకుండా పోయింది.