దిశ దశ, జగిత్యాల:
కొణిదెల కుటుంబానికి ఆరాధ్య దైవమైన అంజన్న సన్నిధికి మరో సారి ఏపీ డిప్యూటీ సీఏం పవణ్ కళ్యాణ్ రానున్నారు. సినీ హిరోగా, జనసేన అధినేతగా ఇప్పటి వరకు పర్యటించిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టు పర్యటన ఖరారైంది. 29న పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం ఫిక్స్ అయినట్టుగా ప్రచారం జరిగినప్పటికీ అధికారికంగా షెడ్యూల్ రాలేదు. గురువారం అధికారిక షెడ్యూల్ విడుదల కావడంతో జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. షెడ్యూల్ ప్రకారం ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మాదాపూర్ లోని తన నివాసం నుండి రోడ్డు మార్గం గుండా బయలుదేరనున్నారు. మద్యాహ్నం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుని గంటన్నర సేపు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు జరపనున్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. ఎన్నికలకు ముందు తన ఎన్నికల ప్రచార రథం వారాహిని కొండగట్టుకు తీసుకవచ్చి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా డిప్యూటీ సీఎం కూడా కావడం, 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు గెలచి వంద శాతం సక్సెస్ రేట్ సాధించారు. దీంతో తమ కుటుంబ ఆరాధ్య దైవమైన కొండగట్టులో మొక్కులు తీర్చుకునేందుకే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వస్తున్నారు.