థాంక్యూ సీఎం కేసీఆర్ గారు…

ఆ జాబితా నుండి నా పేరు తీసేయండి

మల్కాజ్ గిరీ ఎమ్మెల్యే మైనంపల్లి లేఖ సారాంశం ఇదే

దిశ దశ, హైదరాబాద్:

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేతకు కేసీఆర్ కు లేఖ రాశారు. తనకు అవకాశాలు ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను… అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా నుండి నా పేరు తొలగించండి, అలాగే నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నందున నాకు అప్పగించిన అన్ని పదవుల నుండి కూడా నన్ను తొలగించండి అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మైనంపల్లి రాసిన లేఖ శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
ఈ లేఖలో నేను బారత రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తున్నాను, నా నియోజకవర్గమైన మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ ను తిరస్కరించాను, నా మద్దతు దారులు, నియోజకవర్గ ప్రజలతో చర్చలు, సంప్రదింపులు చేసిన ఈ తరువాతే నీనీ నిర్ణయం తీసుకున్నాను అంటూ వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యంతో 2014లో టీఆర్ఎస్ పార్టీకి జీహెచ్ఎంసీలో ఒక్క కార్పోరేటర్ కూడా లేకపోవడంతో పాటు మల్కాజిగిరి లోకసభ స్థానంలో ఎదురుగాలులు వీచినప్పుడు పార్టీలో చేరానని, పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడ్డానని మైనంపల్లి తెలిపారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా నేను చేసిన కృషిని గుర్తించి, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర నిరాశ, నిసృహకు లోనయ్యానని, దాని పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదని మైనంపల్లి వ్యాఖ్యానించారు. పార్టీ నాయకత్వం అట్టడుగు స్థాయి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను విస్మరించి ఎలాంటి సంప్రదింపులు, ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని లేఖలో పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల అభీష్టానికి విరుద్దంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా పేరు మార్చడమే ఇందుకు నిదర్శమన్నారు. పొరుగు రాష్ట్రాలకు విస్తరించడానికి ఫలించని ప్రయత్నాలు తెలంగాణ అభివృద్ది నుండి పార్టీ దృష్టిని దూరం చేశాయని మైనంపల్లి హన్మంతరావు వివరించారు. అనేక మంది అభ్యర్థుల ఎంపికలో పార్టీకి, ప్రజలకు, స్వంత క్యాడర్ కు మధ్య ఉన్న డిస్ కనెక్ట్ వారి నియోజకవర్గాల నుండి పార్టీ క్యాడర్ నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు. వ్యక్తిగత స్థాయిలో, మీడియాలో, సోషల్ మీడియాలో నాపై అసత్య, దురుద్ధేశపూరిత ప్రచారం చేస్తున్న పార్టీ సీనియర్ నేతలతో నాకు తీవ్ర విబేధాలు ఉన్నాయని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని, నాకు కెటాయించిన అసెంబ్లీ టికెట్ ను తిరస్కరించాలని కూడా నిర్ణయించుకున్నానని మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. దిశా నిర్దేశశం, గుర్తింపు కోల్పోయిన కొంతమంది అధికార దాహంతో ఉన్న వ్యక్తుల చేతిలో కీలు బొమ్మగా మారిన పార్టీలో నేను ఒక భాగంగా కొనసాగలేనని వెల్లడించారు. నన్ను భారీ మెజార్టీతో ఎన్నుకున్న నా నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేనని, నా రాజకీయ జీవితంలో నేను పాటించిన సూత్రాలు విలువలు, సేవా నిబద్దతపై నేను రాజీపడలేనం చెప్పుకొచ్చారు. దయచేసి నా రాజీనామాను ఆమోదించాలని, పార్టీలో నేను నిర్వహిస్తున్న అన్ని బాధ్యతల, పదవుల నుండి నన్ను తప్పించాలని, రాబోయే ఎన్నికలకు మీ పార్టీ అభ్యర్థుల జాబితా నుండి నాపేరును ఉప సంహరించుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాన్నారు. ఇప్పటి వరకు మీరందించిన సహకారం, మద్దతుకు ధన్యవాదాలు అంటూ మైనంపల్లి హన్మంతరావు తన లేఖను ముగించారు.

You cannot copy content of this page