వారిద్దరి నడుమే వార్
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
వైవిద్యమైన తీర్పునకు కేరాఫ్ సిరిసిల్ల. సుదీర్ఘకాలం ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులనే అక్కున చేర్చుకున్న చరిత్ర ఈ నియోజకవర్గానికే దక్కుతుంది. స్వాంత్రంత్ర్య పోరాట స్పూర్తితో ఇక్కడి ప్రజలు అధికారానికన్నా పోరాట పటిమకే ప్రాధాన్యం ఇచ్చారు. 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుండి రెండు సార్లు మినహాయిస్తే మిగతా ఎమ్మెల్యేలంతా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే. ఇక్కడి ప్రజలు ఏనాడు కూడా అధికార పక్షానికి చెందిన అభ్యర్థులకు అందలం ఎక్కించేందుకు సాహసించలేదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో కీలక భూమిక పోషించిన ఇక్కడి యోధుల ఆదర్శమో అక ఇతరాత్ర కారణమో తెలియదు కానీ అధికారపార్టీ ఎమ్మెల్యేగా మాత్ర ఒకే ఒక వ్యక్తి సిరిసిల్ల చరిత్రలో మిగిలిపోయారు.
ప్రతిపక్షానికే మొగ్గు…
చేనేత కార్మికులకు పెట్టింది పేరయిన సిరిసిల్ల ఒకప్పుడు సిరిశాల అని పిలిచేవారు. ఆ తరువాత సిరిసిల్లగా రూపాంతరం చెందిన ఈ నియోజకవర్గం విప్లవ పోరాటాలకు కూడా కేంద్ర బిందువుగా నిలిచింది. వామపక్ష సాయుధ దళాలకు ఇక్కడి అడవులు, పల్లెలు షెల్టర్ జోన్ గా నిలిచి రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్రను కూడా తనలో దాచుకుంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 2014 నుండి మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009లో సిరిసిల్ల నుండి పోటీ చేసిన కేటీఆర్ అతి స్వల్ప ఓట్లతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఉద్యమకారుడు, సీనియర్ న్యాయవాది అయిన కెకె మహేందర్ రెడ్డి సిరిసిల్ల నుండి పోటీ చేయాల్సిన సమయంలో అనూహ్యంగా కేటీఆర్ ఇక్కడి నుండి పోటీ చేశారు. దీంతో తొలి ఎన్నికల్లో కేటీఆర్ ఉద్యమ పార్టీ నుండి నిలబగా స్వతంత్ర్య అభ్యర్థిగా కెకె మహేందర్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన టఫ్ ఫైట్ లో కేటీఆర్ 171 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. 2010 బై ఎలక్షన్స్ తో పాటు ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కేటీఆర్ పై చేయిగా నిలుస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో మినహాయిస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా కేటీఆర్ పై ప్రధాన ప్రత్యర్థిగా కెకె మహేందర్ నిలుస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండూరు రవిందర్ రావు కేటీఆర్ చేతిలో ఓటమి పాలైన తరువాత గులాభి పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో కూడా కేటీఆర్ వర్సెస్ కెకె అన్నట్టుగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల నుండి చూసుకుంటే ఒక్క కెకె మహేందర్ రెడ్డిని మినహాయిస్తే తనపై పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులను తనకు అనుకూలంగా మల్చుకోవడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారన్న పేరుంది. గజ్వేల్ లో తన ప్రత్యర్థిగా ఉన్న వొంటేరు ప్రతాపరెడ్డి 2018 ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ కు జైకొట్టారు. కానీ అప్పటికే సిరిసిల్లలో తన ప్రత్యర్థులను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు కేటీఆర్ వ్యూహాలకు పదును పెట్టేశారన్న క్రెడిట్ కోట్టేశారు.
జర్నలిస్ట్ బరిలో…
వివిధ ఎలక్ట్రానిక్ మీడియాలలో జర్నలిస్ట్ గా ప్రస్థానాన్ని కొనసాగించిన రాణి రుద్రమ రెడ్డి కూడా ఇక్కడి నుండి పోటీ చేస్తుండడం గమనార్హం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగడం లేదంటూ పలు వేదికల మీదుగా తన గళాన్ని వినిపించిన రాణి రుద్రమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఈసారి సిరిసిల్ల నుండి పోటీ చేయనున్నారు. మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆధీనంలో ఉన్న టీ న్యూస్ లో కూడా రాణి రుద్రమ కొంతకాలం పనిచేశారు. దీంతో కేటీఆర్ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలో పనిచేసిన జర్నలిస్టు ఆయనకు ప్రతర్థి కావడం కావడం గమానర్హం. బీజేపీ నుండి ఆమె పోటీ చేస్తుండగా స్థానికంగా ఉన్న పార్టీ శ్రేణులు మాత్రం కినుక వహించాయి.