ఎమ్మెల్యేగా ఓడిపోయి… ఎంపీలుగా గెలవాలని…

దిశ దశ, హైదరాబాద్:

ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి చవి చూసిన నాయకులకు ఎంపీ ఎన్నికలపై భరోసా పెట్టుకుంటున్నట్టుగా ఉంది. త్వరలో ఎంపీ ఎన్నికలు జరగనున్నందున తమ భవితవ్యాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది నాయకులు తమ మనసులో ఉన్న విషయాన్ని కూడా బయటకు చెప్పేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అక్కున చేర్చుకోకున్నా ఎంపీ ఎన్నికల్లో తమను అందలం ఎక్కిస్తున్నారన్న అంచనాలతో నాయకులు ముందుకు సాగుతున్నట్టుగా ఉంది. జగిత్యాల నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి చవి చూసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అవకాశం ఇస్తే చేసేందుకు తాను సిద్దమేనని ఇప్పటికే ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లకు కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఈ సారి నిజామాబాద్ నుండి టికెట్ ఆశిస్తున్నారా లేక కరీంనగర్ నుండా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే పీసీసీ మాత్రం ఆయనకు నిజామాబాద్ లోకసభ ఇంఛార్జి బాధ్యతలు అప్పగించడంతో ఎంపీగా నిలబడాలన్న కోర్కెను అధిష్టానం ముందు ఉంచినా ఆయనకు అక్కడి నుండే అవకాశం కల్పిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా నిజామాబాద్ లోకసభ పరిధిలోనే ఉండడంతో అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే మాత్రం అక్కడి నుండే పోటీ చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో వైపున బీజేపీ తరుపు హుజురాబాద్, గజ్వేల్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నేత ఈటల రాజేందర్ కూడా ఎంపీ ఎన్నిక్లలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తనకు అధిష్టానం ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి బరిలో నిలుస్తానంటూ ప్రకటించారు. అయితే ఆయన మెదక్, మల్కాజిగిరిల నుండి పోటీ చేసేందుకు ఇంట్రస్టుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన బాల్క సుమన్ కూడా పెద్దపల్లి నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 2014లో పెద్దపల్లి ఎంపీగా పని చేసినందున అధిష్టానం అవకాశం ఇచ్చినట్టయితే బాల్క గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన అనచరులు అంటున్నారు. ఇక్కడి నుండి బీజేపీ తరుపున పోటీ చేసేందుకు దర్మపురి నుండి పోటీ చేసిన ఎస్ కుమార్, మానకొండూరు నుండి పోటీ చేసిన ఆరెపల్లి మోహన్ ల పేర్లు వినపడుతున్నాయి. కరీంనగర్ నుండి పోటీ చేసిన బండి సంజయ్, కోరుట్ల నుండి పోటీ చేసిన ధర్మపురి అరవింద్, బోథ్ నుండి పోటీ చేసిన సోయం బాపురావు ముగ్గురు కూడా సిట్టింగ్ ఎంపీలే కావడంతో ఈ ముగ్గురికి కూడా మళ్లీ టికెట్ ఇవ్వడం ఖాయం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులంతా కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతుండడంతో ఆయా పార్టీల్లో లోకసభ ఎన్నికల గురించే చర్చ మొదలైంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులు ఇతర నియోజకవర్గాల నుండి కూడా టికెట్లు ఆశించే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జరుగుతోంది.

You cannot copy content of this page