కస్టడిలో పోలీసుల ఆరా..?
దిశ దశ, కరీంనగర్:
తీగలగుట్టపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చివేసిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడు తోట శ్రీపతి రావును కరీంనగర్ పోలీసులు ఒక రోజు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో సోమవారం శ్రీపతి రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం మద్యాహ్నం 3.30 గంటల వరకు విచారణ చేయనున్నారు. సోమవారం శ్రీపతి రావు ఇంటిలో సోదాలు నిర్వహించిన కరీంనగర్ రూరల్ పోలీసులు కీలకమైన డాక్యూ మెంట్లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో శ్రీపతి రావుతో పాటు ఇతరులెవరైనా ఆయనకు అండగా నిలిచారా..? పోలీసు విభాగానికి చెందిన వారు ఉన్నారా..? రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా అన్న వివరాలు కూడా పోలీసు అధికారులు శ్రీపతి రావు నుండి సేకరించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏకంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చివేసి దురక్రమణకు పాల్పడిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. సీపీ అభిషేక్ మహంతి భూ దందాలకు సంబంధించిన వ్యవహారంలో అత్యంత సీరియస్ గా వ్యవహరిస్తుండడంతో ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. ఇందులో భాగంగానే శ్రీపతి రావుపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నాకేం కాదంటున్న వారే…
కరీంనగర్ లో తాము లీగల్ గానే వ్యవహరించామని తమపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేరని ఢంకా బజాయించి చెప్పుకున్న వారే క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటుండడం గమనార్హం. ఇటీవల ఓ కేసులో అరెస్ట్ అయిన ఓ కార్పొరేటర్ భర్తకు సీఎం రేవంత్ రెడ్డి డైరక్ట్ లైన్లో ఉన్నాడంటూ ప్రచారం చేసుకున్నారు. అయినప్పటికీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో నేరస్థులు ఎంతటి వారైనా వదిలేది లేదని చేతల్లో చూపించినట్టయింది. వేరే కేసులో కూడా ఒకరిద్దరు కూడా ఇలాంటి ధీమానే వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు తమ పని తాము చేసుకుంటూనే పోతున్నారు. మరో వైపున ఫిర్యాదు వచ్చిన తరువాత పోలీసు అధికారులు విచారణలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పిలిపించి విచారిస్తూ వదిలేస్తుండడంతో ఇక తమపై కేసులు పెట్టే అవకాశం లేదన్న ధీమాతో తిరుగుతున్న క్రమంలో పోలీసులు చట్టపరంగా అవసరమైన ఎవిడెన్సులను సేకరించి అరెస్టులు చేయడం ఆరంభిస్తున్నారు. దీంతో ఎవరిని ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారోనన్న కలవరం మాత్రం కమిషనరేట్ పరిధిలోని అక్రమార్కులను వెంటాడుతోంది. తప్పించుకుని తిరిగినా పోలీసులు వేటాడి పట్టుకుంటున్న తీరు కూడా వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
dishadasha
1232 posts