లండన్ నుండి కాల్ చేసి… పిల్లలను అనాథలు చేస్తానని బెదిరించి…

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేసు దర్యాప్తు…

దిశ దశ, కరీంనగర్:

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బెదిరించిన కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్చరించిన వ్యక్తిని గుర్తించడంలో సక్సెస్ అయ్యారు. నిందితుని నెంబర్ ఆధారంగా సాంకేతికతను అందిపుచ్చుకున్న కరీంనగర్ పోలీసులు అతని పూర్తి వివరాలను సేకరించారు. గత సెప్టంబర్ 28న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు +447886696497 నంబర్ నుండి వాట్సప్ కాల్ వచ్చింది. రూ. 20 లక్షలు ఇవ్వాలని లేనట్టయితే మీ పిల్లలను అనాథలను చేస్తామని చెప్పి అగంతకుడు బెదిరించాడు. దీంతో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైం నంబర్ 339/2024 , భారతీయ న్యాయ సంహిత 308, 351(3), (4) సెక్షన్ల కింద నమోదైన కేసును చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవాని నగర్ కు చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) గా గుర్తించిన పోలీసులు ప్రస్తుతం లండన్ లో నివసిస్తున్నాడని తేల్చారు. నిందితుడు లండన్ నుండే మేడిపల్లి సత్యంకు వాట్సప్ కాల్ చేసినట్టుగా గమనించిన పోలీసులు అతనికి లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. వాట్సప్ కాంటాక్ట్ నంబర్ ఆధారంగా పోలీసులు సైబర్ టెక్నాలజీ ద్వారా నిందితుని గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే వాట్సప్ కాల్ చేసిన నంబర్ +44 కోడ్ ఉన్న దేశాన్ని వచ్చిందని గమనించి ఆ  వివరాలను సేకరించారు. లండన్ కోడ్ గా గుర్తించిన పోలీసులు కాంటాక్ట్ నంబర్ ద్వారా జరిపిన ఆర్థిక లావాదేవీలను కూడా ట్రేస్ చేశారు. బ్యాంకు ఖాతా నంబర్లను కూడా సేకరించిన పోలీసు అధికారులు అకౌంట్ ద్వారా పాస్ పోర్టు నంబర్ సేకరించారు. పాస్ పోర్టులో ఉన్న వివరాల ద్వారా నిందితుని ఆచూకి లభ్యం అయింది. దీంతో ప్రత్యేకంగా ఓ పోలీసు బృందాన్ని బోడుప్పల్ కు పంపించగా అఖిలేష్ రెడ్డి లండన్ లో ఉంటున్నట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. అతను ఇండియాలోకి అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. నిందితున్ని గుర్తించేందుకు సాంకేతికతను అందిపుచ్చుకుని సక్సెస్ అయ్యామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకట రమణ ఒక ప్రకటనలో తెలిపారు.

You cannot copy content of this page