పలు సెక్షన్లలో నమోదు…
నేడు స్పీకర్ ను కలిసే అవకాశం…
దిశ దశ, కరీంనగర్:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఆర్డీఓ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, జగిత్యాల ఎమ్మెల్యే పీఏలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రభుత్వం ప్రారంభించబోతున్న సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం హాజరైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ తమ అభిప్రాయలను, ప్రభుత్వానికి సూచనలు అందించారు. ఇందులో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రసంగిస్తున్న క్రమంలో నీది ఏ పార్టీ అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డాక్టర్ సంజయ్ ని నిలదీశారు. అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో పార్టీల ప్రస్తావన తీసుకరావడంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. ఒక దశలో ఒకరినొకరు తోచుకుండగా సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, పోలీసులు ఇద్దరిని నిలువరించారు. ఈ సమావేశానికి హాజరైన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కౌశిక్ రెడ్డిని రివ్యూ మీటింగు నుండి బయటకు తీసుకొచ్చారు.
ఫిర్యాదులు…
సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలపై ఆదివారం రాత్రి రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ సత్తు మల్లేశం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పీఏ కత్తరోజు వినోద్ కుమార్ లు వేర్వేరుగా కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
కేసుల వివరాలివే…
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నమోదు చేసిన క్రిమినల్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. క్రైం నంబర్ 30/2025 U/s 121(1),132,126 221,351(2)of BNS Act , క్రైం నంబర్31/2025 U/s 126 (2), 115 (2), 352, 292 of BNS ACT, క్రైం నంబర్ 32/2025 U/s 132,115(2), 352, 292 BNS యాక్టులలో క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు.
హైదరాబాద్ చేరుకున్న తరువాత…
కరీంనగర్ సమీక్షా సమావేశంలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన అంశం అంతటితో ముగిసిందని భావించారంతా. జిల్లా ఇంఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తమ్ముని వరస అయిన కౌశిక్ రెడ్డి విషయంలో జిల్లా నాయకులు కూడా ఆచూతూచి వ్యవహరించారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు. తన పొలిటికల్ లైఫ్ లో ఇలాంటి లీడర్ ను తాను ఏనాడూ చూడలేదని వ్యాఖ్యానించగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఘాటుగానే స్పందించడం విశేషం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరును తప్పు పట్టిన ఆయన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే సమావేశం ముగిసిన తరువాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మంత్రులతో కలిసి హెలిక్యాప్టర్ లో హైదరాబాద్ కు వెల్లడంతో అంతా సద్దుమణిగిందని భావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ లో జరిగిన పరిణామాలపై సమగ్రంగా వివరించిన తరువాత కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను, డీజీపీని కూడా కాంగ్రెస్ శాసన సభా పక్షం కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తోంది.