దిశ దశ, హైదరాబాద్:
సోషల్ మీడియాలో క్రేజీ కోసం ఏకంగా కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరేసిన వంశీ అలియాస్ హర్ష అలియాస్ మహధేవ్ పై మూడు కేసులు నమోదు అయ్యాయి. సనత్ నగర్, కూకట్ పల్లి, కేపీహెచ్ బి స్టేషన్లలో మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. రెండు రోజుల క్రితం ఆయా ప్రాంతాల్లోని రోడ్లపైకి వచ్చిన వంశీ గాల్లోకి డబ్బులు విసిరిసి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆయన చేసిన అతి విన్యాసాలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలను వివిధ సోషల్ మీడియా అకౌంట్లలో కూడా వంశీ షేర్ చేశారు. అంతేకాకుండా తాను జనాల మధ్యకు వెల్లి విసిరినవి అసలైన కరెన్సీ నోట్లేనంటూ మరో వీడియో కూడా పోస్ట్ చేశారు. ఆ తరువాత ప్రముఖ ఎలక్ట్రానికి మీడియా ఛానెల్స్ తీరును తప్పు పడుతూ వంశీ మరో వీడియోను కూడా షేర్ చేశారు. తాను చేస్తున్న సేవను ఎందుకు గుర్తించలేదంటూ ప్రశ్నించారు. అత్యుత్సాహంతో చేసిన తప్పిదాన్ని ఒఫ్పుకోకుండా తాను చేసింది సరైందనన్న రీతిలో వ్యవహరించిన తీరుపై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెన్సీ నోట్లకు విలువ ఇవ్వకుండా అలా చేయడం ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తింది. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికల్లో క్రేజీ కోసం వంశీ చేసిన స్టంట్లపై పోలీసులు కూడా చట్టాలకు పని చెప్పడంతో ఇలా అత్యుత్సాహన్ని ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పకనే చెప్పారు.