దిశ దశ, కరీంనగర్:
వలస కార్మిక కుటుంబానికి చెందిన మూడు రోజుల శిశువు కిడ్నాప్ కలకలం కరీంనగర్ లో సంచలనంగా మారింది. జిల్లా కేంద్రంలోని మాత శిశు కేంద్రంలో మూడు రోజుల క్రితం బావుపేటలో నివాసం ఉంటున్న వలస కూలీ డెలివరీ అయ్యారు. బీహార్ కు చెందిన వీరు కరీంనగర్ సమీపంలోని బావుపేటలో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం డెలివరీ అయిన ఆమె భర్త భోజనం తీసుకొచ్చేందుకు ఇంటికి వెళ్లాడు. ఐసీయూలో ఉన్న బాలింత వద్ద తన అన్నకొడుకును ఉంచి వెళ్లాడు. ఈ సమయంలో మూడు రోజుల పసికందును ఎత్తుకుని వచ్చిన ఆ బాలుడు ఎంసీహెచ్ ఎంట్రన్స్ వద్దకు తీసుకుని వచ్చి ఓ మహిళలకు అప్పగించాడు. ఆ మహిళ ఆసుపత్రి ఆవరణలో అటు ఇటు తిరిగి ఓ ఆటోలో కొంతసేపు వెయిట్ చేసి అందులోనే వెల్లిపోయినట్టుగా సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఆ బాలుడు వట్టి చేతులతోనే ఆసుపత్రిలోపలకు వెల్లాడు. బాలింతకు ఫిడ్స్ సోకడంతో అమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నందున పసికందుకు ఇన్ ఫెక్షన్ కాకుండా ఉండేందుకు బంధువుల వద్ద ఉంచి తల్లి పాల కోసం తీసుకెళ్లి తిరిగి వారికే అప్పగిస్తున్నారు. అయితే పసికందు అదృశ్యం అయిన విషయం కూడా చాలా సేపటి తరువాత గుర్తించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తో పాటు పోలీసు అధికారులు ఎంసీహెచ్ చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసు అధికారులు పసికందును చూసుకునేందుకు ఉన్న బాలుడే తీసుకెళ్లి ఓ మహిళకు అప్పగించినట్టుగా గుర్తించారు. అయితే బాలింత భర్త మాత్రం ఆ పిల్లవానికి ఏమీ తెలియదని ఎవరితో అయినా వెల్లిపోతుంటాడని చెప్తున్నాడు. అలాంటప్పుడు ఆ బాలునికి మూడు రోజుల పసికందును చూసుకోమని అప్పగించి ఎలా వెల్లిపోయాడన్నది అంతు చిక్కకుండా పోయింది. కనీసం ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న వారికైనా ఈ సమాచారం ఇచ్చి తన భార్యకు వంట చేసుకుని తీసుకొస్తానని అప్పటి వరకు తన అన్న కొడుకు చూసుకుంటాడన్న విషయాన్ని చెప్పి వెల్లాల్సి ఉంటుంది కదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరో వైపున బాలుడు శిశువును ప్రత్యేకంగా ఆసుపత్రి ఎంట్రన్స్ వద్దకు తీసుకవచ్చి ఓ మహిళకు అప్పగించడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శిశువును ఎత్తుకెళ్లిన మహిళే శనివారం కూడా బాధిత కుటుంబంతో తిరిగిందని ఆసుపత్రిలో ఉన్న ఇతర పేషెంట్లు చెప్తున్నారు. వాస్తవాలు ఏమిటన్న విషయంపై పోలీసులు ఆరా తీసే పనిలో నిమగ్నం కాగా, శిశువు తండ్రితో పాటు బాలున్ని కూడా స్టేషన్ కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. అయితే బాలింతలు అనారోగ్యానికి గురైనప్పుడు వారికి పుట్టిన పసికందులను చూసుకునేందుకు ప్రత్యేకంగా ఓ వార్డు లేదా ఓ హాల్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ హాల్ కు ఇంచార్జీ గా ఎవరిని నియమించలేదా, కనీసం బాలుడు పసికందును తీసుకుని బయటకు వెల్లి వట్టి చేతులతో తిరిగి వచ్చిన విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది వెంటనే గమనించలేకపోయారా అన్నది కూడా పజిల్ గానే తయరైంది. ఏది ఏమైనా కరీంనగర్ మాత శిశు సంరక్షణ కేంద్రంలో శివువు అదృశ్యం అయిన ఘటన మాత్రం అటు పేరెంట్స్ నిర్లక్ష్యం, ఇటు ఆసుపత్రి యంత్రాంగం పట్టించుకోని తనం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు.