దిశ దశ, హైదరాబాద్:
హన్మకొండ హంటర్ రోడ్ శాయంపేటకు చెందిన ఓ సామాన్యుడు చేపట్టిన పోరాట ఫలితానికి ప్రతిఫలం మూడు దశాబ్దాలకు దక్కింది. వర్గీకరణ అన్న ఏకైక నినాదంతో కదం తొక్కిన ఆయన లక్ష్యం సుప్రీంకోర్టు తీర్పుతో సాధించినట్టయింది. అణగారిన వారిని చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరుబాట పట్టిన ఆయన ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1994 జులై 7న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రకాషం జిల్లా ఈదుముడి గ్రామం నుండి కేవలం 20 మందితో ప్రారంభమైన వర్గీకరణ డిమాండ్ తెలుగు రాష్ట్రాల ప్రతి పల్లెను తాకింది. అక్కడి నుండి దేశంలోని చాలా రాష్ట్రాలకు కూడా పాకి బలమైన వాదంగా మారిపోయింది. ‘‘దండోరా’’ పేరిట చేపట్టిన ఈ ఉద్యమంతో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలని, ఎస్సీ సామాజిక వర్గాల్లో బలమైన వర్గాలే లాభం పొందుతున్నాయని, మాదిగతో పాటు ఉప కులాలు అణివేతకు గురవుతున్నాయన్న ఆందోళనతో కొనసాగింది. మంద కృష్ణ మాదిగ చేపట్టిన ఈ ఉద్యమం ఉవ్వెత్తును ఎగిసిందనే చెప్పాలి. మాదిగ, ఉప కులాలకు చెందిన జనాభాకు రిజర్వేషన్లలో సరైన ప్రాతినిథ్యం లభించడం లేదన్న వాదనను తెరపైకి తీసుకొచ్చిన మంద కృష్ణ ఆయా సామాజిక వర్గాలను తట్టి లేపారనే చెప్పాలి. ఉన్నత చదువులు చదివినా, సంక్షేమ పథకాలు అందుకోవాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ వివక్షకు గురవుతున్నామన్న ఆవేదనతో ఆందోళనకు బీజం వేసిన మంద కృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా ఎదుర్కొన్న ఒడి దొడుకులు అన్ని ఇన్ని కావు. బలమైన సామాజిక వర్గాల ఒత్తిళ్లతో సతమతమైన సందర్భాలెన్నెన్నో. అయినా తన లక్ష్యం వర్గీకరణే అని తేల్చి చెప్పి ఉద్యమాన్ని కొనసాగించారే తప్ప వెనక్కి మాత్రం తగ్గలేదు. ఒక దశలో చట్టసభల్లో మాదిగల గళాన్ని వినిపించాలని రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ ప్రజా క్షేత్రంలో సక్సెస్ కాలేకపోయారు. తెలుగు రాష్ట్రంలో ప్రారంభం అయిన ఈ ఉద్యమ ప్రభావం దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ తీవ్రంగా పడింది. మహారాష్ట్రలోని మాంగ్, తమిళనాడులోని అరుంధతి, కర్ణాటకలోని మాదిగల డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. 70శాతం ఉన్న తమ సామాజిక వర్గాలకు దామాషా పద్దతిలో రావల్సిన వాటా రావడం లేదన్న విషయాన్ని ఎలుగెత్తి చాటిన మంద కృష్ణ చివరకు సక్సెస్ అయ్యారు. గతంలో అసెంబ్లీ తీర్మాణం చేసినప్పటికీ అమలు విషయంలో మాత్రం ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరగా గురువారం వర్గీకరణకు అనుకూలంగా దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ‘‘దండోరా’’ లక్ష్యం నెరవేరినట్టయింది.
గర్వం మాకది…
అణగారిన సామాజిక వర్గాలపై అణిచివేస్తున్న తీరు సరికాదని భావించిన ప్రభుత్వం అంటరాని తనం అమానుషం నేరం అంటూ ప్రచారం చేసింది. అయినా అగ్రవర్ణాల వివక్షను చవి చూడక తప్పలేదు నాటితరం. ఈ క్రమంలో కులం పేరుతో దూషించిన వారిపై కేసులు నమోదు చేసే ప్రక్రియ కూడా స్టార్ట్ చేశాయి ప్రభుత్వాలు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి నిమ్న వర్గాలను కించపరిచే వారిపై కఠినంగా వ్యవహరించాయి. ఈ క్రమంలో కులం పేరుతో దూషించడం కాదు కదా ఆ సామాజిక వర్గం పేరును ఉచ్ఛరించేందుకు చాలా మంది వెనకంజ వేశారు. ఈ క్రమంలో మాదిగ దండోర ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మంద కృష్ణ జర్నలిస్టులతో చర్చించినప్పుడు ఇచ్చిన క్లారిటీ ఇది… కులం పేరుతో దూషించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్న అణగారిన వర్గాల వారే కులం పేరును పేరు వెనక చేర్చుకున్నప్పుడు అందరూ అలాగే పిలుస్తారు కదా… వారిపై కేసులు పెట్టాల్సి వస్తుంది కదా అన్న ప్రశ్న వచ్చింది. అయితే తమ కులం పేరు చెప్పుకునేందుకు గర్వంగానే ఫీలవుతాం అందుకే మాదిగ బిడ్డలంతా కూడా పేరు వెనక మాదిగ అని పెట్టుకుంటే తప్పులేదు… వారిని అలా పిలిస్తే కూడా తప్పుకాదు… కానీ ఆ కులం పేరుతో పాటు అదనంగా తమను దిగజార్చే విధంగా ఉన్న పదాలను జోడిస్తేనే తప్పు అవుతుంది అప్పుడే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయిని వివరించారు. 30 ఏళ్లుగా సాగుతున్న ఈ పోరాటం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మాదిగ, ఉప కులాల వారికి బలాన్నిచ్చినట్టయింది. దీంతో ఆయా రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.
భవిష్యత్తు బంగారు మయం…
వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మాదిగ, ఉప కులాల వారు రిజర్వేషన్ సౌకర్యాలు అందుకోనున్నారు. ఇందులో ప్రధానంగా ఉన్నత విద్యనభ్యసించిన వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం అమలు కానుంది. దీంతో చాలా మంది యువత ఉద్యోగావకాశాలు అందుకునేందుకు మార్గం సుగమం అయింది. రాజకీయాలతో పాటు విద్యారంగం వంటి ఇతరాత్ర అంశాల్లో కూడా రిజర్వేషన్ అమలు కావడంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారు సంక్షేమ ఫలాలను అందుకోవడంతో వారి స్థితిగతుల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి.
నో అన్న మంద కృష్ణ..?
తన టార్గెట్ మాత్రం వర్గీకరణకు అనుకూలంగా చట్టం తీసుకరావాలన్నదే కావడంతో మంద కృష్ణ మాదిగ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ముఖ్య నేతలతో కూడా చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోడీని కూడా మెప్పించి ఒఫ్పించి వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు శ్రమించారు. అయితే ఈ విషయాన్ని కూడా ప్రధాని ప్రత్యేకంగా బహిరంగ సభ మీుదగా ప్రకటించారంటే మంద కృష్ణ ఏ స్థాయిలో సమాలోచనలు చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో మంద కృష్ణను పోటీ చేయాలన్న ప్రతిపాదన బీజేపీ అధిష్టానం నుండి వచ్చిందని, రాజ్యసభ సభ్యునిగా పెద్దల సభకు పంపిస్తామని కూడా కమలనాథులు చెప్పారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే ఆయన మాత్రం ఈ ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించిన మంద కృష్ణ వర్గీకరణ అయితే చాలన్న వాదనే బలంగా వినిపించినట్టుగా చాలామంది చెప్పుకుంటుంటారు. అంతర్గతంగా ఏంజరిగిందో తెలియదు కానీ ఈ అంశం గురించి మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే చివరకు సుప్రీం కోర్టు తీర్పుతో మూడు దశాబ్దాల మాదిగల డిమాండ్ కు సానుకూలమైన తీర్పుకు రావడం ఆయా సామాజిక వర్గాలను సంబరాల్లో ముంచెత్తింది.