అజ్ఞాత వాసం అక్కడే… అస్కార్ అవార్డు అక్కడే…

దిశ దశ, భూపాలపల్లి:

ఎర్రజెండా నీడలో విప్లవ పాటలతో మార్మోగిందా పల్లె. కంజెర్ల చప్పుళ్లతో కాలికి గజ్జె కట్టిన అన్నలను విప్లవ పాటలను నేర్పిందా గ్రామం. రెండు దశాబ్దాల క్రితం ఆ ఊరు పేరు చెప్తేనే ఉలిక్కిపడ్డ పరిస్థితులు. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టిన పీపుల్స్ వార్ లో చేరి పోరుబాట వైపు సాగింది ఇక్కడి యువత. దొరతనానికి వ్యతిరేకంగా నినదించారక్కడి జనం. అదే సమయంలో పుట్టిన ఓ బిడ్డ కూడా విప్లవ పాటలే పాఠాలు అన్నట్టుగా ఎదిగినా ఎంచుకున్న మార్గం మాత్రం వేరే. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవని అంటుంటాం కానీ ఈ గ్రామంలో జన్మించిన వారు మాత్రం వైవిద్యమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంతకీ ఏమా గ్రామం… ఏమా కథ అంటే మీరీ కథనం చదవాల్సిందే…

చిన్న గ్రామం…

నూతనంగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఉన్న చల్లగరిగె గ్రామం తెలంగాణాలొని అన్ని ఊర్లలాగే ఓ చిన్న పల్లెటూరు. విప్లవ పోరుబాట సాగుతున్న ఈ క్రమంలో ఈ గ్రామస్థులు కూడా ఎర్రజెండాలు ఎత్తి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా నినదించారు. ఆనాటి విప్లవ కారుల స్పూర్తితో ముగ్గురు అజ్ఞాతంలోకి వెల్లి పోరాటం చేశారు. ఆయుధాలు పట్టుకుని అడవుల్లో తిరుగుతూ నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పోరాటం చేశారు. అడుగడును విప్లవ భావజాలంతో ముందకు సాగిన ఈ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ మూడు రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించడంతో ఈ గ్రామానికి విప్లవ పంథాకు ఉన్న బంధానికి తెరపడినట్టయింది. అయితే అదే సమయంలో అదే గ్రామంలో పుట్టిన మరో బిడ్డ ఎంచుకున్న మార్గం వేరనే చెప్పాలి. ఈ గ్రామంలో పుట్టిన ముప్పలనేని శివ చంద్రబోస్ పుట్టి పెరిగింది చల్లగిరిగె గ్రామంలోనే కావడంతో ఆయన ఎదుగుతున్న క్రమంలో కూడా గ్రామంలో విప్లవ భావజాలపు ప్రభావం తీవ్రంగానే ఉండేది. కానీ ఆయన మాత్రం ఉన్నత చదువుల కోసం చల్లగరిగెను వీడి భాగ్యనగరం వైపు పయనం అయ్యారు. ముందు డిప్లోమా పూర్తి చేసి ఇంజనీరింగ్ చేస్తూ తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటు ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు. గ్రామంలో విప్లవ పాటలు మారుమోగుతున్న సమయంలో చంద్రబోస్ అంబర్ పేట ప్రాంతంలో నివాసం ఉంటూ వినాయక మంటపాల వద్ద భక్తి పాటలు పాడి ఉండొచ్చు. అన్నలుగా చెలామణి అవుతూ అడవి బాట పట్టిన గ్రామానికి చెందిన ముగ్గురు కూడా ఎదురు కాల్పుల ఘటనల్లో మృత్యువాత పడ్డారు. ఇదే గ్రామానికి చెందిన చంద్రబోస్ మాత్రం పట్నం వైపు పయనించి తనలోని క్రియేటివిటీకి పదును పెట్టి… తెలుగు తనం ఉట్టిపడే పాటలు రాస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టుకున్నారు. సినీ రంగంలోనే అత్యున్నతమైన అస్కార్ పురస్కారానికి ఎంపికయ్యారు చంద్రబోస్. ఒకే గ్రామానికి చెందిన వారు వేర్వేరు ఆలోచనలతో లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగిన తీరు వేరే. 

You cannot copy content of this page