మానేరు తీరాన మిన్నంటిన రోదనలు
దిశ దశ, మానకొండూరు:
అప్పటి వరకు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టిన ఆ మైనర్లు విగత జీవులయ్యారు. రంగులతో ఆడిన వారంతా స్నానం చేసేందుకని మానేరు నదికి చేరుకున్నారు. నిలువ ఉన్న నీటి గుంతలోకి దిగి మృత్యువాత పడ్డారు. హోలి పర్వదినాన చోటు చేసుకున్న ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల వాసులను విషాదంలోకి నెట్టింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే…. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా అలుగునూర్ మానేర్ వాగులో రివర్ ఫ్రంట్ కోసం తీసిన గుంతలోకి దిగి స్నానం చేస్తుండగా అందులో చిక్కుకుని మరణించారు. హోలీ సంబరాలు ముగిసిన తరువాత మానేరు నదిలోని నీటి గుంతలో చిక్కుకుని చనిపోయారు. మృతుల్లో వీరాంజనేయులు (16), సంతోష్ (13), అనిల్ (14)లు ఉన్నారు
ఇక్కడ ప్రమాదం… అక్కడ విషాదం
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఏపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులంతా కూడా ఆంధ్రప్రదేష్ లోని ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలానికి చెందినవారు కావడంతో ముగ్గురు చిన్నారులు మరణించారని తెలుసుకుని వారి బంధులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల తల్లిదండ్రులు జీవనోపాధి కోసం కరీంనగర్ కు వలస కూలీలుగా వచ్చారు. వీరు కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డు సమీపంలో నివాసం ఉంటున్నారు.
సెక్యూరిటీ లేదా..?
అయితే మానేరు రివర్ ఫ్రంట్ లో గోతులు తవ్విన తరువాత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి పరోక్షంగా కాంట్రాక్టర్ నిర్లక్షమేనన్న అంటున్నారు స్థానికులు. ఇక్కడ రివర్ ఫ్రంట్ నిర్మాణ పనలు చేపట్టిన కాంట్రాక్టర్ గోతుల వద్ద రక్షణ చర్యలు తీసుకోవలసి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు వైపు ఎవరూ వెల్లకుండా సెక్యూరిటీ చర్యలు తీసుకున్నట్టయితే ముగ్గురి మరణం సంభవించేది కాదని అంటున్నారు. హోలీ పర్వదినం సందర్భంగా అక్కడ పనులు జరిగే అవకాశాలు లేనందున కాంట్రాక్టు పనులు చేసే అవకాశం లేదన్న విషయాన్ని గమనించి నీటి గుంత వద్ద కనీసం ఫెన్షింగ్ ఏర్పాటు చేసినా సరిపోయేదని అంటున్నారు. సాధారణ జనం అటుగా వెల్లకుండా నిలువరించేందుకు కాంట్రాక్టర్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నదే అంతు చిక్కకుండా పోయింది. సెక్యూరిటీ గార్డు ఉన్నట్టయితే అటుగా వెల్తున్న వీరిని ఆపే వారు కానీ అక్కడ ఎవరూ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏసీపీ సందర్శన
మానేరు నదిలో జరిగిన ప్రమాదం గురిచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ తాండ్ర కర్ణాకర్ రావు ఘటనకు సంబందించిన వివరాలను సేకరించారు.