దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైల్ పట్టాలు తప్పిన ఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది. సౌత్ సెంట్రల్ రైల్వై జీఎం అశోక్ జైన్ నేతృత్వంలో త్రిమేన్ కమిటీని నియమించింది. రైళ్ల పునరుద్దరణ ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత కమిటీని వేసిన రైల్వే విభాగం ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని దిశానిర్దేశం చేసింది. ఓవర్ లోడ్ కారణంగా గూడ్స్ రైల్ పట్టాలు తప్పిందా, కోచుల వారిగా ఎంత సామర్థ్యంలో ఐరన్ కాయిల్స్ లోడ్ చేశారన్న వివరాలను సేకరించనుంది ఈ కమిటీ. అలాగే ట్రాక్ మెయింటెనెన్స్ విషయంలోనూ విచారణ జరిపి ఎప్పుడెప్పుడు వాటిని పరీక్షించారు, ట్రాక్ లో లోపాల కారణంగా యాక్సిడెంట్ జరిగిందా లేక మరేదైనా కారణమా అన్నది కూడా తేల్చాల్సి ఉంది. సిగ్నలింగ్ వ్యవస్థ లోపం ఏమైనా ఉందా అని కూడా ఆరా తీయాలని రైల్వే ఉన్నతాధికారులు సూచించినట్టుగా సమాచారం. సమగ్రంగా వివరాలను సేకరించి ఇందుకు సంబంధించిన ఎనాలిస్ చేసి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేందుకు కమిటీ సమాయత్తం అయినట్టు సమాచారం. త్రిమేన్ కమిటీ నివేదికను రైల్వే మంత్రికి సీల్డ్ కవర్ లో పంపించిన తరువాత లోపాలకు గల కారణాలను గుర్తించే అవకాశం ఉంది. ప్రమాదానికి గల అసలు కారణాన్ని గుర్తించి బాధ్యులైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రైల్వే విభాగం భావిస్తున్నట్టుగా సమాచారం.