దిశ దశ, జగిత్యాల:
ప్రముఖ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన దోపీడి దొంగల్లో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 12 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. గత ఫిబ్రవరి 24 తెల్లవారు జామున జరిగిన కొండగట్టు అంజన్న ఆలయంలోకి చొరబడ్డ దొంగలు స్వామి వారికి సంబందించిన వెండి వస్తువులను అపహరించుకపోయారు. వెంటనే 10 బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు దోపిడీ ముఠా కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ భాస్కర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయగా జగిత్యాల డీఎస్సీ రత్నాపురం ప్రకాష్ నేతృత్వంలో పోలీసులు దొంగల కోసం వేట చేపట్టారు. డాగ్ స్క్వాడ్ రాబిన్ ఇచ్చిన క్లూతో పాటు క్లూస్ టీమ్ కూడా ముఠా ఆనవాళ్లను అందించింది. దీంతో నాలుగు ప్రత్యేక బృందాలు కర్ణాటకలోని బీదర్ కు వెల్లి దొంగలను పట్టుకునే పనిలో పడగా మొదటగా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కొంత వెండిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆదివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి నుండి రూ.8.40 లక్షల విలువ చేసే 12 కిలోల వెండిని పట్టుకున్నారు. నిందితులు రామ్ శెట్టి జాదవ్ (62), దేవి దాస్ జాదవ్ (22), విట్టల్ రావ్ దేశ్ ముఖ్ (59)లను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు రామారావు జాదవ్, విక్రమ్ జాదవ్ లు పరారీలో ఉన్నారని తెలిపారు. మల్యాల సీఐ రమణ మూర్తి, ఎస్సై చిరంజీవిలు అనుమానంగా తచ్చాడుతున్న నిందులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేయడంలో క్రియాశీలకంగా పనిచేశారని డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ తెలిపారు.
గుర్తించకుండా ఉండాలని…
దోపీడీ దొంగల కోసం వెంటనే రంగంలోకి దిగినప్పటికీ ముగ్గురిని పట్టుకున్నప్పటి్కీ మిగతా వారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. మొదట దొరికిన దొంగల నుండి స్వామి వారి గర్బాలయంలో చోరీ చేసిన వాటినే నేరుగా పట్టుకున్నారు. కానీ తప్పించుకున్న ఈ ముగ్గురు దొంగలు అంజన్న ఆలయం నుండి దొంగలించినవని ఎవరూ గుర్తించవద్దని భావించి వాటిని కరిగించి వెండి కడ్డీలుగా మార్చారు. అయినప్పటికీ నిందితులపై ఓ కన్నేసీ ఉంచిన పోలీసులు వారిని పట్టుకోవడంతో అసలు గుట్టు రట్టయింది.