ఓడలు బండ్లు… బండ్లు ఓడలు… ఏడాదిలో ఎంత మార్పు…


దిశ దశ, కరీంనగర్:

ఓడలు బండ్లయ్యాయి… బండ్లు ఓడలయ్యాయంటే ఇదేనేమో… గత సంవత్సరం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగానే సరిపెట్టుకోవడం, సాధారణ ఎంపీగా ఉన్న వ్యక్తి కేంద్ర సహాయ మంత్రి కావడం, మాజీ  ఎంపీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కావడం… కరీంనగర్ రాజకీయాల్లో విచిత్ర ఘటనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న వారు ఏక కాలంలో చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించడం విశేషం.

ప్రత్యర్థులుగా ముగ్గురు…

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్, బీజేపీ తరుపున బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ తరుపున పొన్నం ప్రభాకర్ లు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో గంగుల కమలాకర్ గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ 2014 ఎంపీ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. మాజీ ఎంపీ అయిన పొన్నం తనకు అవకాశం వస్తుందని ఆశించి బరిలో నిలిచేందుకు విఫలం అయ్యారు. బీజేపీ మాత్రం 2014 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపిన బండి సంజయ్ కే మరో అవకాశం కల్పించి విఫలం అయ్యింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు కూడా ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. ఇక పోతే 2019 లోకసభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ ను విజయం వరించింది.

ప్రస్తుతం ఇలా…

ఒకప్పుడు కరీంనగర్ లో ప్రత్యర్థులుగా ఉన్నవారు ఏకకాలంలో చట్టసభలకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ లు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 2024 లోకసభ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ మరో సారి లోకసభకు ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చింది.

తారుమారు…

అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు రాష్ట్ర మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గంగుల మాజీ మంత్రి హోదాతో సరిపెట్టుకుంటున్నారు. అయితే 2014 ఎన్నికల ఓటమి చవి చూస్తున్న పొన్నం ప్రభాకర్ రాజకీయంగా పతనం అయ్యారని ప్రత్యర్థులు ప్రచారం చేసినప్పటికీ ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారు. హుస్నాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన ఆయన విజయం కోసం రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బండి సంజయ్ కూడా కరీంనగర్ ఎంపీగా రెండోసారి గెలవడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం దక్కింది. దీంతో నిన్న మొన్నటి వరకు రాష్ట్ర మంత్రిగా ఉన్న గంగుల సాధన ఎమ్మెల్యేగా పరిమితం కావాల్సి రాగా, సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి హోదాలో, తెరమరుగు అయిపోతాడనుకున్న పొన్నం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం విశేషం.

నిర్విఘ్నమైన కలయిక…

వినాయక చవితి సందర్భంగా కరీంనగర్ లో ముగ్గురు ప్రత్యర్థులు ఒకే చోట కలుసుకున్నారు. టవర్ సర్కిల్, ప్రకాశం గంజ్, పాత బజార్ తో పాటు పలు ప్రాంతాల్లోని విఘ్నేశ్వరుల మంటపాల్లో పూజలు నిర్వహించేందుకు వెళ్లిన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు ఒకరినొకరు కలుసుకున్నారు.

You cannot copy content of this page