దిశ దశ, మానకొండూరు:
ఓ వైపున లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తుతున్నామని ఇరిగేషన్ అధికారులు ప్రకటించినా… ఇసుకాసురులు మాత్రం తమ పంథా మార్చుకోలేదు. గేట్లు ఎత్తితే ఎంటీ..? ఎత్తకపోతే మాకేంటన్న ధీమాతో వ్యవహరించారు ట్రాక్టర్ వాలాలు. ఎల్ ఎండి గేట్లకు దిగువ ప్రాంతంలోని శ్రీనివాసనగర్ సమీపంలో మూడు ట్రాక్టర్లు వరద నీటిలో చిక్కుకపోయాయి. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా ఇసుక రవాణా చేసేందుకు మానేరు నదిలో ట్రాక్టర్లను తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఎల్ఎండీ గేట్లు ఎత్తడం… వరద పోటెత్తడంతో మూడు ట్రాక్టర్లు నీటిలోనే చిక్కుకపోయాయి. ఆదివారం ఉదయం ఓ ట్రాక్టర్ వరద ఉధృతి కారణంగా నదిలో బోల్తా పడిందని, వరద ఇలాగే కొనసాగితే మాత్రం ట్రాక్టర్లు కొట్టుకపోయే ప్రమాదం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో కూడా…
మానేరు డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండడంతో ఇసుకకు ఫుల్ డిమాండ్ ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే నీరు రాకముందే ట్రాక్టర్లలో ఇసుక తరలించే ప్రయత్నంలోనే అవి నీటిలో చిక్కుకపోయి ఉంటాయని స్థానికులు చెప్తున్నారు. సాధారణ రోజుల కంటే ఎక్కువ ధర పలుకుతుందన్న ఆశతోనే ఇసుక తరలించేందుకు సాహసించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవున్నాయి. అయితే రాత్రి వేళల్లో కూడా మానేరు నది నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని తాజా ఘటనతో స్పష్టం అయింది. చీకట్లో అయితే తమను పట్టించుకునే వారు ఎవరూ ఉండరన్న నమ్మకంతోనే రాత్రి పూట కూడా ఇసుకను తరలిస్తున్నారని స్పష్టం అవుతోంది.