దిశ దశ, మంచిర్యాల:
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చిన వరదల ఎఫెక్ట్ తెలంగాణాపై కూడా పడింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ 1 అండర్ గ్రౌండ్ మైన్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న విజయ్ కుమార్ కూతురు తానియా సోని మృత్యువాత పడ్డారు. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ లోని ఓ బిల్డింగ్ సెల్లార్ లో ఏర్పాటు చేసిన రౌస్ స్టడీ సెంటర్ లో సివిల్స్ కోచింగ్ కోసం సోని జాయిన్ అయ్యారు సెల్లార్ లోకి వచ్చిన భారీ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు అభ్యర్థులు మృత్యువాత పడ్డారు. కూతురిని సివిల్ సర్విసెస్ ఆఫీసర్ చేయాలని కలలు కన్న విజయకుమార్ దంపతులకు ఆమె చనిపోయిన విషయం తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయి సోని దేశానికి సేవలందించాలని భావించిన ఈ కుటుంబం ఆమె మరణ వార్త విని హతాశులయ్యారు. విజయ్ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన వారని అధికార వర్గాలు తెలిపాయి.
సెల్లార్ కోచింగ్ సెంటర్…
దేశ రాజధానిలో అత్యున్నత స్థాయి ప్రమాణాలతో సివిల్ సర్విసెస్ అధికారులను తయారు చేసే కోచింగ్ సెంటర్లు ఉన్నాయన్న ప్రచారం జరిగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా కూడా యువకులు సివిల్ సర్విసెస్ కు ఎంపికయ్యేందుకు సుశిక్షుతులు కావాలని కలలు కని ఢిల్లీకి వెల్తుంటారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లలో మౌళిక వసతులు ఎలా ఉన్నాయో అన్న అనుమానం ఈ ఘటనతో వ్యక్తం అవుతోంది. సెల్లార్ లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమో అధికారులు ఆలోచించాల్సి ఉంది. మరో వైపున ఢిల్లీలో వాతావరణ పరిస్థితులను అంచనా వేసి కోచింగ్ తీసుకుంటున్న సివిల్ సర్విసెస్ అభ్యర్థులను సురక్షిత ప్రాంతాలకు ముందస్తుగా తరలించకపోవడం కూడా నిర్వహాకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యే అవకాశం ఉన్న సెల్లార్ లలోకి భారీ వర్షం పడ్డప్పుడు వరద తాకిడి ఎక్కువగా ఉంటుందన్నది వాస్తవం. బహుళ అంతస్తుల భవనాల్లోని సెల్లార్ లోకి నీరు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారి ప్రాణాలకే ప్రమాదం అన్న విషయాన్ని విస్మరించడం ఏంటన్నదే మిస్టరీగా మారింది. దేశం నలుమూలల నుండి కూడా సివిల్స్ లో తర్ఫిదు అయ్యేందుకు ఢిల్లీకి వెల్లే అభ్యర్థుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారోనన్న విషయంపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముగ్గురు అభ్యర్థులను బలి తీసుకున్న ఈ సెల్లార్ లోకి 10 నుండి12 ఫీట్ల మేర వరద నీరు వచ్చి చేరిందంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం కోచింగ్ సెంటర్లపై కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటి విషాద ఘటనలకు బ్రేకులు పడే అవకాశం లేదు.
ముఖ్యమంత్రి ఆరా…
ఢిల్లీలోని రౌస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల మృత్యువాత విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తో మాట్లాడారు. ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయ్ కుమార్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ 1 మైన్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారని కమిషనర్ వివరించారు. విజయ్ కుమార్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరుపు అవసరమైన సహకారం అందించాలని సీఎం ఆదేశించారు. అయితే సోని మృతదేహాన్ని వారి స్వరాష్ట్రమైన బీహార్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి కమిషనర్ గౌరవ్ తెలిపారు.