అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు
దిశ దశ, ఏపీ బ్యూరో:
బంగారు ఆభరణాలు, డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో ముగ్గురు మహిళలు నాలుగు హత్యలకు పాల్పడ్డారు. అది కూడా మద్యంలోనో, కూల్ డ్రింక్ లోనో సైనైడ్ కలిపి హత్య చేశారు. చివరకు ఘరాన గ్యాంగ్ గుట్టును గుంటూరు జిల్లా పోలీసులు రట్టు చేశారు. ధనదాహంతో నిందితులు పైశాచికత్వంగా వ్యవహరించిన తీరు గురించి పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
రెండేళ్లుగా హత్యలు…
గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన మహిళలు దాదాపు రెండేళ్లుగా హత్యల పరంపర కొనసాగిస్తున్నారు. తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీకి చెందిన మునగప్ప రజని (40), ముడియాల వెంకటేశ్వరి (32), గొంతు రమణమ్మ (60)లు ముఠాగా ఏర్పడ్డారు. వీరికి ఓ వ్యక్తి బంగారాన్ని శుద్ది చేసేందుకు ఉపయోగించే సెనైడ్ తీసుకొచ్చేవాడు. ఈ ముగ్గురు మహిళలు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న వారిని మచ్చిక చేసుకుని మద్యం, కూల్ డ్రింక్స్ లలో సైనైడ్ కలిపి తాగించేవారు. చనిపోయిన తరువాత వారి వద్ద ఉన్న ఆభరణాలను, నగదును ఎత్తుకెళ్లే వారు.
బయటపడిందిలా…
జిల్లాలోని వడ్లమూడి గ్రామ సమీపంలోని క్వారీ వద్ద కుళ్ళిపోయిన మహిళ మృతదేహాం లభ్యమైంది. చనిపోయిన ఆమె షేక్ నాగూర్ బిగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొదట అనుమానస్పద మృతిగా ఆరా తీస్తున్న పోలీసులకు ఒక్కో విషయం తెలిసింది. బాధితురాలు నాగూర్ బీ కుమారుడు షేక్ తమీజ్ అదృశ్యానికి ముందు రజనీ, వెంకటేశ్వరితో సాన్నిహిత్యంగా ఉన్నారన్న విషయం చెప్పడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకున్న పోలీసులు మహేష్ అనే ఆటో డ్రైవర్ వీరిని తరలించినట్టుగా గుర్తించి అతన్ని విచారించారు. గత జూన్ 5న బాధితురాలిని నిందితులను వడ్లమూడి జంక్షన్ వద్ద దింపినట్టుగా ఆటో డ్రైవర్ వివరించాడు. మార్గ మధ్యలో మద్యం కొనుగోలు చేసుకున్నారని కూడా ఆయన పోలీసులకు వివరించారు. ఈ క్లూ ఆధారంగా విచారించిన పోలీసులు నాగూర్ బీకి సెనైడ్ కలిపిన మద్యం తాగించి చనిపోయిన తరువాత దోపిడీకి పాల్పడ్డారని గుర్తించారు. ఆమె మృతదేహాన్ని సమీపంలోని పొలంలో వదిలేసి వెల్లిపోయారు.
మరిన్ని హత్యలు…
నిందితుల హత్య గురించి వెలుగులోకి వచ్చిన తరువాత పోలీసులు మరిన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఇదే పద్దతిలో మరో మూడు హత్యలలో పాల్గొన్నారని, మరియు మరో ఇద్దరు మహిళలను చంపడానికి ప్రయత్నించారని తేలింది. నిందితుల వద్ద సైనైడ్, చోరీకి చేసిన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ముడియాల వెంకటేశ్వరి గతంలో డబ్బు కోసం కంబోడియాకు వెళ్లడానికి ముందు ఏపీలో వాలంటీర్‌గా పనిచేసినట్లు కూడా వెల్లడైంది. అక్కడ, ఆమె తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించి విఫలమై సైబర్ క్రైమ్ లో పాల్గొన్నట్టుగా పోలీసులు తేల్చారు. ఆరోగ్య సమస్యల కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత సైనేడ్ మరణాలకు పాల్పడుతూ దోపిడీలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా ఈ ముఠా ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్టుగా గుంటూర్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు.