దిశ దశ, భూపాలపల్లి:
రాష్ట్రంలోనే వైవిద్యమైన పరిస్థితులు ఆ జిల్లాలో నెలకొన్నాయి. చారిత్రాత్మక నేపథ్యం తనలో దాచుకున్న ఈ జిల్లాలో నేడు జరుగుతున్న పరిణామాలు కూడా విచిత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఆ జిల్లా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆ జిల్లాలో నిత్యం ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మన్ల పర్యటనలు కొనసాగుతుంటాయి. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది మాత్రం అక్షరాల నిజం.
ఏ జిల్లా అది…?
సిరులనందించే సింగరేణి గనులు, రాష్ట్రాన్ని సస్య శామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఎన్నో చారిత్రాత్మక ప్రాంతాలకు ఈ జిల్లా వేదికగా నిలుస్తోంది. అయితే ఈ జిల్లాలో నేడు నెలకొన్న వైవిద్యమైన పరిస్థితులు కూడా అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తుతున్నాయి. స్థానికులతో పాటు ఆ ప్రాంత క్యాడర్ కూడా అయోమయంలో కూరుకపోతున్న పరిస్థితి తయారైంది. ఎప్పుడు ఏ ప్రాంతానికి చెందిన నేతలు వస్తారో తెలియక తూర్పు ప్రాంత వాసులు అప్రమత్తంగా జీవనం సాగిస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నెలకొన్న ఈ విచిత్ర పరిస్థితులు బహుష రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా ఎదురుకావనే చెప్పాలి. పూర్వ కరీంనగర్ జిల్లాలోని ఐదు మండలాలను భూపాలపల్లి జిల్లాలో చేర్చగా మంథని నియోజకవర్గ పరిధిలో ఇవి కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా కాటారం జడ్పీటీసీ సభ్యురాలు జక్కు శ్రీహర్షిణి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిగా పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న పుట్ట మధు, భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ గా పని చేస్తున్న జక్కు శ్రీహర్షిణీలు తరుచూ ఈ ప్రాంతంలో పర్యటనలు జరుపుతుంటారు. మరో వైపున భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గండ్ర జ్యోతి ప్రస్తుతం వరంగల్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. జిల్లా పరిషత్ పాలనాపరమై అంశాల్లో జక్కు శ్రీహర్షిణీ పర్యవేక్షిస్తుండగా, మంథని నియోజకవర్గ పార్టీ సమీకరణాలను పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు నెరుపుతున్నారు. జిల్లా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న గండ్ర జ్యోతి వరంగల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి సతీమణి కూడా అయిన జ్యోతి ఇక్కడి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. పూర్వ కరీంనగర్ జిల్లాకు చెందిన మహదేవపూర్, పల్మెల, మహాముత్తారం, కాటారం, మల్హర్ మండలాల్లో తరుచూ ముగ్టురు జడ్పీ ఛైర్మన్ల పర్యటనలు కొనసాగుతుండగా, భూపాలపల్లిలోని భూపాలపల్లి, చిట్యాల, ఘన్ పూర్, టేకుమట్ల, శాయంపేట మండలాల్లో మాత్రం పార్టీ పరంగా వరంగల్ జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, పరిపాలనా అంశాల్లో అయితే జక్కు శ్రీ హర్షిణీ పర్యవేక్షిస్తున్నారు. దీంతో భూపాలపల్లి జిల్లాకు మూడు జిల్లాల పరిషత్ ఛైర్ పర్సన్ లతో అనుబంధం పెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.