సోషల్ మీడియాలో క్రేజీ కోసం అత్యుత్సాహం
దిశ దశ, హైదరాబాద్:
వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్నదా ప్రాంతం… ఓ బైక్ మీద వస్తున్న వారిలో వెనక కూర్చున్న యువకుడు రన్నింగ్ లో ఉండగానే లేచి డబ్బులు గాల్లోకి వెద జల్లాడు. మరిన్ని చో్ట్ల నడిరోడ్డుపై డబ్బులు గాల్లోకి విసిరేశాడు. హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే కూకట్ పల్లి ప్రాంతంలో ఇలా చేశాడా యువకుడు. అతన్ని ఫాలో అయిన యువకులు వీడియో షూట్ చేస్తు ఎంజాయ్ చేశారు కూడా. సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు రీల్స్ తీయడమే కాకుండా తన ఛానెల్ ను ఫాలో అయితే మీకు కూడా ఆదాయం వస్తుందంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేశాడు. హర్ష అలియాస్ మహదేవ్ యూ ట్యూబర్ గా, ఇన్ స్టాగ్రామర్ గా పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. అయితే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఈ యువకుడు చేసిన తీరు చట్టవ్యతిరేకమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరడం వల్ల వాటిని తీసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో స్థానికులు రోడ్లపైకి వచ్చారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. అలాగే కరెన్సీ నోట్లను విచ్చలవిడిగా విసిరేయడం వల్ల అగౌరవపర్చినట్టే అవుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నందున ఆర్బీఐ నిబంధనలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రీల్స్ కోసం, ఫాలోవర్లలో క్రేజీని పెంచుకునేందుకు ఏకంగా డబ్బును ఇలా వెదజల్లడం మాత్రం సరైన చర్య కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తెలంగాణ పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
https://x.com/TeluguScribe/status/1826568266728251518