కాకా ఫ్యామిలీకి టికెట్ కష్టాలు తప్పడం లేదెందుకో..?

తొలి జాబితాలో దక్కని స్థానం

దిశ దశ, పెద్దపల్లి:

కాంగ్రెస్ పార్టీలో కాకాలు తీరిన కాకా పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది పెద్దపల్లి నియోజకవర్గం. హ్యాట్రిక్ విజయం సాధించిన వెంకట స్వామి ఏఐసీసీలోనే ముఖ్యనేతగా ఎదిగారు. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన వెలువడే తొలి జాబితాలోనే కాకా పేరు ఖచ్చితంగా ఉండేది. పెద్దపల్లి లోకసభ స్థానం గడ్డం వెంకటస్వామికి పెట్టని కోటగా మారిపోయిందన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తనయుడు, మనవనికి మాత్రం టికెట్ కష్టాలు తప్పడం లేదు. సొంత పార్టీ నాయకులే కాకా వారసులపై వ్యతిరేకత చూపుతుండడం విచిత్రమనే చెప్పాలి.

1989 నుండి…

1989 నుండి పెద్దపల్లి ఎంపీగా వరసగా మూడు సార్లు వెంకటస్వామి గెలిచారు. 1996 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ చెలిమెల సుగుణాకుమారిని రంగంలోకి దింపి సక్సెస్ అయింది. ఇక్కడి నుండి కాకలు తీరిన కాకపై సుగుణ కుమారిని బరిలో నిలపడమే టీడపీ చేసిన సాహసం అన్న చర్చ సాగితే ఏకంగా ఆమె రెండు సార్లు కూడా కూడా ఇక్కడి నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. 2004 ఎన్నికల్లో నాలుగోసారి ఎంపీగా గెలిచిన వెంకటస్వామి ఆ తరువాత రాజకీయాల నుండి తప్పుకున్నారు. కార్మిక నేతగా దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కాక ఆల్ ఇండియా కాంగ్రెస్ లో కీలక నేతల్లో ఒకరిగా చెలామణి అయ్యారు. సీఎంలను కూడా ఆదేశించే స్థాయిలో ఉన్న వెంకటస్వామి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పెద్దపల్లి ఎంపీగా ఆయన తనయుడు వివేకానంద 2009 ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చారు.

ఆ తరువాత…

2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వివేక్ రాష్ట్రంలో ఉవ్వెత్తున్న సాగుతున్న ఉద్యమ నేపథ్యాన్ని గమనించి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. విభజన బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన పెద్దపల్లి నుండి రెండో సారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల తరువాత తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా కూడా పని చేశారు. రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగడంతో ఇక్కడి నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్క సుమన్ చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 2019 లోకసభ ఎన్నికల్లో వివేక్ టికెట్ ఖాయం అనుకున్న తరుణంలో సెగ్మెంట్ ఇంఛార్జీలంతా ఒక్కటై వివేక్ కు వ్యతిరేకంగా జట్టు కట్టారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్, పుట్ట మధూకర్ తో పాటు ఏడు సెగ్మెంట్లకు చెందిన వారంతా ఏకతాటిపైకి వచ్చి అధినేత కేసీఆర్ ను మెప్పించి ఒప్పించడంలో సఫలం అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ నేతను గులాభి పార్టీలో చేర్పించి ఆయనకు టికెట్ ఇప్పించడంలో వివేక్ వ్యతిరేక వర్గం సక్సెస్ అయింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయాలని చూస్తున్న క్రమంలో వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి ఎ చంద్ర శేఖర్ అభ్యర్థిత్వం ఖరారు చేయించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు చకాచకా ఆయనచే నామినేషన్ దాఖలు చేయించడంతో 2019 ఎన్నికల్లో వివేక్ బరిలో నిలిచే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే అప్పుడు బీజేపీ నుండి ఆఫర్ వచ్చినా ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపిన వివేక్ ఆ తరువాత కాషాయం కండువా కప్పుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుర్వాశ్రమంలోకి చేరిన వివేక్ చెన్నూరు నుండి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే లోకసభ టికెట్ మాత్రం తన తనయుడు వంశీకి ఇవ్వాలన్న ఒప్పందం కూడా చేసుకునే వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. దీంతో వంశీకే టికెట్ ఖాయమనుకున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపున గోమాస శ్రీనివాస్ తనకు టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఢిల్లీ పెద్దలతో కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరో వైపున ఎవరూ ఊహించని విధంగా గతంలో రెండు సార్లు పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన చెలిమెల సుగుణాకుమారి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు అనుకూలంగా ఏడు సెగ్మెంట్లలోని మెజార్టీ ఇంఛార్జీలు మంత్రాంగం నెరుపుతుండడంతో మరోసారి గడ్డం ఫ్యామిలీ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. పెద్దపల్లి టికెట్ కోసం వంశీ ఒక్కని పేరే ఏఐసీసీ వరకు చేరిందన్న ప్రచారం జరిగినప్పటికీ తొలి జాబితాలో మాత్రం ఆయనకు అవకాశం దక్కకపోవడం గమనార్హం.

ఢిల్లీలో చక్రం తిప్పుతూ…

వెంకటస్వామి మనవడు వంశీకి కాకుండా సుగుణ కుమారికి టికెట్ ఇచ్చినట్టయితే బావుంటుందన్న ప్రతిపాదనను పెద్దపల్లి లోకసభ పరిధిలోని ఆయా సెగ్మెంట్ల నాయకులు ఢిల్లీ పెద్దల ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలోనే మకాం వేసిన వారంతా కూడా సుగుణా కుమారికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపున పెద్దపల్లిలో కూడా ‘మాదిగ’ సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపల్లి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. వంశీకి టికెట్ ఖాయమైపోయిందనుకున్న నేపథ్యంలో పెద్దపల్లి లోకసభ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఝలక్ ఇచ్చినట్టయింది. దీంతో పెద్దపల్లి బరిలో నిలబడాలన్న గడ్డం కుటుంబానికి మరోసారి ఆటంకం ఎదురైనట్టుగా స్పష్టం అవుతోంది. గత ఎన్నికల్లో తండ్రి వివేకానందకు కాంగ్రెస్, గులాభి పార్టీల స్థానిక నాయకులు అడ్డుపడినట్టుగానే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి విముఖత వ్యక్తం అవుతుండడం గమనార్హం. వంశీ కూడా తనకు టికెట్ ఖాయమన్న రీతిలోనే పావులు కదుపుతున్న క్రమంలో అనుకోని విధంగా ఎదురైన వ్యతిరేకత తొలి ప్రయత్నానికే ఆటకంగా మారినట్టయింది.

You cannot copy content of this page