దిశ దశ, ఆసిఫాబాద్:
ప్రకృతిలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా పెరిగిన చలిని తట్టుకోలేక విలవిలలాడుతున్న జనాన్ని పులి కూడా భయపెడుతోంది. సరిహధ్దు అడవుల్లో సంచరిస్తున్న పులి ఎటువైపు నుండి వచ్చి దాడి చేస్తోందోనన్న ఆందోళన స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు అటవీ గ్రామాల్లో నిన్న మొన్నటి వరకు ఏనుగుల భయం వెంటాడితే తాజాగా పెద్దపులి ప్రాణాలు తీస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
కూలీ మృతి…
శుక్రవారం ఉదయం జిల్లాలోని కాగజ్ నగర్ నజ్రుల్ నగర్ కు చెందిన మోర్లె లక్ష్మీ(21) వ్యవసాయ పనికి వెల్తుండగా పులి దాడి చేసింది. తీవ్రంగా ఉన్న చలి కారణంగా పొగమంచూ పరుచుకుని ఉన్న సమయంలో గ్రామ పొలిమేరల్లో పొంచి ఉన్న పులిని గమనించకుండా పని కోసం వెల్తున్న లక్ష్మీ ప్రాణాలు కోల్పోయింది. దీంతో గ్రామస్థులు కాగజ్ నగర్ అటవీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, పులి బారి నుండి రక్షించేందుకు అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పశువుల వేట…
కొద్ది రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ గ్రామాల్లో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. గురువారం ఉదయం వాంకిడి మండలం సోనాపూర్ అటవీ ప్రాంతంలో పశువుల మందపై దాడి చేయగా, అంతకుముందు ఆదివారం మండలంలోని దాబా, బండకాస గ్రామం సమీపంలోని కోర్ డోబ్రాలొద్ది ప్రాంతంలో ఆవుల మందపై పులి దాడి చేయడంతో ఒక ఆవు మృతి చెందగా మరో రెండు ఆవులు గాయపడ్డాయి.
ఇదే తంతు…
గత కొంతకాలంగా ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు అటవీ గ్రామాల్లో వన్య ప్రాణుల సంచారం తీవ్రంగా పెరిగిపోయింది. సీజన్ వచ్చిందంటే చాలు ఏనుగుల మంద, పులులు, చిరుత పులుల సంచారం సాధారణంగా మారిపోయింది. దీంతో జనం ఇంటి నుండి బయటకు రావాలంటేనే జంకిపోతున్నారు. ఇటీవలే మహారాష్ట్ర నుండి వచ్చిన ఏనుగు ఒకటి సరిహద్దు గ్రామాల వాసులను కలవరపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా పెద్దపులి లక్ష్మీని బలి తీసుకోగా పలు చోట్ల పశువులపై దాడి చేసింది. దీంతో పశువులను మేతకు తీసుకెళ్లేందుకు కూడా స్థానికులు భయపడిపోతున్నారు.