అప్రమత్తమైన అటవీ అధికారులు
తూర్పు అడవుల్లో సంచారం…
దిశ దశ, భూపాలపల్లి:
గోదావరి తీర ప్రాంతంలో పెద్దపులి సంచారం సంచలనంగా మారింది. మహదేవపూర్, కాటారం మండలాల్లోని పలు ప్రాంతాల్లో గత సోమవారం నుండి పెద్ద పులి తిరుగుతోంది. పులి జాడ కోసం అటవీ అధికారులు అన్వేషణ మొదలు పెట్టారు.
వారం రోజులుగా…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి శివార్లలో సోమవారం నుండి పులి సంచారం వెలుగులోకి వచ్చింది. మహధేవపూర్, కాటారం రహదారి మీదుగా వెల్తున్న వారు పులిని గమనించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత కాటారం మండలం వీరాపూర్, జాదరావుపేట, గుండ్రాత్ పల్లి, దామెరకుంట పరిసర ప్రాంతాల్లో కనిపించిందని స్థానికులు చెప్తున్నారు. మహాదేవపూర్ మండలం అన్నారం పరిసర ప్రాంతాల్లో కూడా పులి సంచరించినట్టుగా స్థానికులు వివరిస్తున్నారు. అన్నారం క్రాసింగ్ వద్ద సంచరించిందని, గ్రావిటీ కెనాల్ ఏరియాలో కనిపించిందని కూడా ప్రచారం జరుగుతోంది.
అప్రమత్తం…
పులి సంచిరిస్తోందన్న సమాచారం అందుకోగానే అటవీ శాఖ అధికారులు పులి అడుగులు గుర్తులను సేకరించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి అడుగులకు సంబంధించిన ఆనవాళ్లను పరిశోధించినట్టయితే దాని గురించి అంచనా వేసే అవకాశం ఉంటుంది. అలాగే పులి సంచరిస్తున్నప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టయితే దాని గురించి సమగ్రంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. పులిపై ఉన్న చారలను బట్టి కొత్త పులా గతంలో ఈ ప్రాంతంలో తిరిగిందేనా అన్న వివరాలపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అటవీ అధికారులు దాని ఆనవాళ్లు కెమెరాల్లో రికార్డు చేసే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు. స్థానికులు చెప్తున్న విషయాల ఆధారంగా అయితే పులి వయసుతో ఉందని, గర్భం దాల్చి ఉందన్న ప్రచారం అయితే జరుగుతోంది.
ఐదేళ్లుగా…
2020 నుండి మహదేవపూర్ సబ్ డివిజన్ పరిధిలో తరుచూ పులి సంచారం వెలుగులోకి వస్తోంది. మహదేపూర్, పలిమెల, కాటారం, మల్హర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పులి ఉనికి బయట పడింది. దీంతో తాజాగా వెలుగులోకి వచ్చిన పులి గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన పులి ఒకటేనా కాదా అన్నది తేలాల్సి ఉంది. మహారాష్ట్ర నుండి ఈ పులి వచ్చినట్టుగా అంచనా వేసే పరిస్థితులు లేకుండా పోయాయి. కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక రీచులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న వారికి పులిని ఎవరో ఒకరు గమనించే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఐదేళ్లుగా ఒకే ప్రాంతంలో పులి ఉనికి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో అవాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందా అన్న చర్చ కూడా స్థానికంగా సాగుతోంది, గతంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు బయటపడగా, ఈ సారి మాత్రం ఫిబ్రవరి నెలలో దాని ఉనికి వెలుగులోకి రావడం గమనార్హం.
టైగర్ జోన్…
గతంలో మహదేవపూర్, కాళేశ్వరం రహధారిలో టైగర్ జోన్ ఉండేది. కుదురుపల్లి సమీపంలోని వాగును ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో పులి తిరిగేది. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం కుదురుపల్లి వంతెన దాటిన తరువాత ఉన్న సమ్మక్క గద్దెల నుండి సుమారు 200 నుండి 300 మీటర్ల దూరంలో ఫారెస్ట్ అధికారులు భారీ ఎత్తున మంచె కూడా ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతంలో షెల్టర్ తీసుకున్న పులి కుదురుపల్లి వాగులో నీటిని తాగేందుకు వస్తుందని చెప్పేవారు. అయితే ఆ తరువాత ఈ ప్రాంతంలో అడవులు తగ్గిపోవడంతో పెద్దపులి సంచారం వెలుగులోకి వచ్చిన దాఖలాలు అయితే అంతగా లేదు. కానీ 2020 నుండి మాత్రం తరుచూ ఈ ప్రాంతంలో పెద్దపులి కనిపిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. టెక్నికల్ ఎనాలిసిస్ రిపోర్ట్ వస్తే తప్ప పులికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. సీసీ కెమెరాల్లో పులి సంచారం రికార్డు అయితే మాత్రం చారల ఆధారంగా ఇంతకు ముందు ఏ అటవీ ప్రాంతంలో తిరిగిందో తెలిసే అవకాశం ఉంటుంది. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అటవీ ప్రాంతంలో తిరిగిన పులి, ప్రస్తుతం మహధేవపూర్ సబ్ డివిజన్ ఏరియాలో తిరుగుతున్న పులి ఒకటేనా కాదా అన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో తిరిగిన పులి ఇప్పుడు తిరుగుతున్న పులి ఒకటే అయితే మాత్రం వీరాపూర్, అన్నారం పరిసర ప్రాంతాల్లో పులి అవాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా భావించవచ్చు. సాధారణంగా అన్ని పెద్దపులులపై ఒకే విధమైన చారలు ఉండవని ఫోటో లభ్యం అయినట్టయితే ఈ విషయంపై క్లారిటీ వస్తుందంటున్నారు అటవీ అధికారులు. ఒకవేళ గతంలో ఇక్కడ సంచరించిన పులి, ఇప్పుడు తిరుగుతున్న పులి ఒక్కటే అయితే మాత్రం దాని అవాస ప్రాంతంగా ప్రకటించే అవకాశాలు ఉంటాయి. పెద్దపులి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు ఫారెస్ట్ అధికారులు.
చంపుతుందా..?
ముఖ్యంగా పెద్దపులి మనషులను గమనించినా పంజా విసిరే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని తెలుస్తోంది. పులి దృష్టిలో రెండు కాళ్ల జంతువులకు తనకు సంబంధం లేదన్నట్టుగానే భావిస్తుందని వన్యప్రాణి విభాగం నిపుణులు చెప్తున్నారు. నాలుగు కాళ్లతో సంచరించే వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని, సడన్ గా పులికి అతి దగ్గరలో కనిపిస్తే మాత్రమే స్వీయ రక్షణ కోసం దాడి చేస్తుందని కూడా వివరిస్తున్నారు. టైగర్ జోన్ అటవీ ప్రాంతాల్లో సంచరించే మనుషులను పులి చాలా సార్లు చూసి ఉంటుందని, దానిని మనుషులు గమనించడమే చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుందని కూడా అంటున్నారు. అయితే పులి స్వేచ్ఛకు భంగం కల్గించే విధంగా వ్యవహరించినప్పుడు, దానిని ఇబ్బందులు కల్గించే పరిస్థితులు ఎదురయినప్పుడు మాత్రమే పంజా విసురుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.