కొండగట్టులో ప్రచార రథాల ప్రారంభం
జగిత్యాల నుండి జైత్రయాత్ర షురూ…
దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్దం చేసుకుంది. ఏఐసీసీ అగ్ర నేతలు హాజరు కానున్న ఈ ప్రచార కార్యక్రమం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 18న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నం అయింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి సుశాంక్ మిశ్రా శుక్రవారం కొండగట్ట అంజన్న క్షేత్రాన్ని సందర్శించారు. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటనకు సంబంధించిన రూట్ ను పర్యవేక్షించారు. సుశాంక్ తో పాటు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ధర్మపురి, చొప్పదండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యంలు కూడా ఉన్నారు.
పూజల తరువాత…
ఈ నెల 18న కొండగట్టు అంజన్న క్షేత్రానికి రానున్న రాహుల్, ప్రియాంక గాంధీలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం టీపీసీసీ ఆధ్వర్యంలో సిద్దం చేసిన ప్రచార రథాలను కూడా ప్రారంభించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్న ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిమగ్నం అయ్యాయి.
సీనియర్ నేత ఇలాకా…
కొండగట్టులో ప్రచార రథంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక బస్సులో జగిత్యాల వరకు రాహుల్, ప్రియాంకలు ఇద్దరు కూడా ప్రయాణించనున్నారు. సాయంత్రం జగిత్యాల కొత్త బస్గాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న రోడ్ షోలో పాల్గొననున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు ఇద్దరు ఒకే సారి ప్రచారంలో పాల్గొనడంతో పాటు సీనియర్ నేత మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నియోజకవర్గం నుండి క్యాంపెయిన్ ప్రారంభించడం విశేషం. దీంతో ఏఐసీసీకి చెందిన ఇతర ముఖ్య నాయకులు, పీసీసీ నేతలు వీరి పర్యటనకు రానున్నారు.