దళితబంధు ఏ రాష్ట్రంలో లేదు
డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్
దిశ దశ, హుజురాబాద్:
లబ్ధిదారులు వ్యాపారవేత్త లుగా ఎదగాలంటే ఆర్థిక క్రమశిక్షణ, కష్టపడే తత్వాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలని డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజక వర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించిన దళితబంధు పథకం అమలు తీరును పరిశీలించేందుకు శనివారం ఐదుగురు సభ్యులతో కూడిన డిక్కీ (దళిత్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆండ్ ఇండస్ట్రీ) బృందం హుజురాబాద్ నియోజక వర్గంలోని శాలపల్లి, చల్లూరు, జమ్మికుంటలలో యూనిట్ లను పరిశీలించి, దళితబంధు ద్వారా గడిచిన ఆర్థిక వృద్ధి, వ్యాపార విధానం గురించి లబ్ధిదారులును అడిగి తెలుసుకున్నారు. సింగాపురం కిట్స్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ… భారతదేశ జనాభాలో 25శాతం ఉన్న దళితులను గొప్ప వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది సమాజంలో ఉన్నత వ్యక్తులుగా నిలపాలనే సదుద్దేశ్యంతో దళితబంధు పథకం ప్రవేశపెట్టిన దళితోద్దారకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన వ్యాపార రంగంలో దళితులు అడుగుపెట్టాలన్న లక్ష్యంతో దళితబంధు స్కీం ప్రారంభించడం సంతోషకరమన్నారు. జీవితమంటే అందమైన బట్టలతో హుందాగా జీవించడం కాదని, ఆత్మగౌరవంతో జీవించాలనే డా. బి ఆర్ అంబేడ్కర్ ఆశయాలను నిజం చేయాలని, తీసుకునే స్థాయి నుండి నలుగురికి ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. పేదరికంలో పుట్టడం తప్పుకాదు, పేదరికంతోనే చనిపోవడం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు బాసటగా నిలిచే విధంగా తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నట్టయితే వ్యాపారంలో రాణించగలుగుతామన్న విషయాన్ని మరిచిపోకూడదన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పోకడలకు అనుగుణంగా అభివృద్ది సాదించాలని సూచించారు. బీదరికంలో పుట్టి గోప్ప పారిశ్రామిక వేత్తలుగా ఎదిగిన వారి జీవితాలే స్పూర్తిగా తీసుకుని వ్యాపార రంగంలో ఉన్నతులుగా ఎదగాలని నర్రా రవికుమార్ ఆకాంక్షించారు. ఇప్పుడిప్పుడే వ్యాపారంలోకి అడుగుపెట్టిన వారికి డిక్కి చేదోడుగా నిలుస్తుందని ప్రకటించారు. తయారీ సంస్థల నుండి నేరుగా వస్తువుల కొనుగోళ్లు చేసే విధంగా డిక్కీ దోహదపడుతుందన్నారు. అమెరికా, లండన్, దుబాయి, ప్రాన్స్ వంటి దేశాల్లో డిక్కి సేవలు అందిస్తోందని, ఒక వర్గ అభ్యున్నతి కోసం ఎక్కడా కూడా పథకాలు అమలు కావడం లేదన్నారు. కానీ తెలంగాణలో మాత్రం దళిత బంధు పథకం అమలు చేయడం ఆదర్శ ప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, డిక్కి ప్రతినిధులు కె రవికుమార్, పరమేష్, రమేష్, డి నారాయణ, ఎస్సీ కార్పోరేషన్ అధికారులు సురేష్, నాగార్జున, ప్రత్యేకాధికారి రాంబాబు, హుజురాబాద్ మున్సిపల్ కమీషనర్ తదితరులు పాల్గొన్నారు.
