దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేతను చత్తీస్ గడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణాలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన ఈయన నాలుగు దశాబ్దాలుగా సాయుథ పోరుబాట కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో దండకారణ్య అటవీ ప్రాంతంలో ఆయన ఉనికిని గుర్తించిన బలగాలు పత్యేకంగా ఆరా తీయడం మొదలు పెట్టాయి. నార్త్ సబ్ జోనల్ బ్యూరోలో లాజిస్టిక్స్ సరఫరా చేయడంతో పాటు, మొబైల్ పోలిటికల్ స్కూల్ (MOPOS) టీమ్ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న బల్మూరి నారాయణ రావు అలియాస్ ప్రభాకర్(57)ను చత్తీస్ గడ్ లోని కంకేర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదు అయ్యాయి. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కీలక బాధ్యతల్లో ఉన్న ప్రభాకర్ పోలీసులకు చిక్కడం సంచలనంగా మారింది. అంతర్జాతీయ విప్లవ సమూహాల అగ్రనేతగా వ్యవహరిస్తున్న ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి స్వగ్రామానికి చెందిన ప్రబాకర్ 1984లో విప్లవ పంథా వైపు వెల్లారు. కేంద్ర కమిటీ కీలక బాధ్యులుగా ఉన్న బసవరాజు, కె రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, దేవ్ జీ, అలియాస్ కుమా దాదా, కోసా, సోను, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తో పాటు పలువురు అగ్రనేతలతో కలిసి పనిచేసిన బల్మూరి నారాయణ రావు అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. కంకేర్ జిల్లాలోని అంతఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన అరెస్ట్ అయ్యారు. నారాయణ రావు అరెస్ట్ ను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆయన నేపథ్యం…
1984 నుండి 1994 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ వార్, మావోయిస్టుల పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ ఏరియాలో 1995 నుండి 97 వరకు, 1998 నుండి 2005 వరకు నార్త్ బస్తర్, కోయిలిబేరా ప్రాంతంలో, 2205 నుండి 2007 వరకు DKSZC సప్లై టీమ్ లో పనిచేస్తూ, అర్బన్ నెట్ వర్క్ బాధ్యతలు నిర్వహించారు. 2007 నుండి 2008 వరకు మన్సూర్ మోహాలా ప్రాంతంలో, 2008 నుండి 2024 వరకు DKSZC కమిటీ సరఫరా కమిటీ, MOPOS ఇంఛార్జిగా పని చేస్తున్నారు.
ధర్మపురిలోవిద్య…
బీర్పూర్ గ్రామానికి చెందిన బల్మూరి నారాయణ రావు ధర్మపురిలో విద్యాభ్యాసం చేశారు. ఇంటర్ చదువుతుండగా విప్లవ పార్టీలో చేరాడు. 1982-83లో ధర్మపురిలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో నారాయణ రావు కోసం పోలీసులు గాలిస్తుండగా అజ్ఞాతంలోకి వెల్లినట్టుగా తెలుస్తోంది. నలుగురు అన్నదమ్ముల్లో నారాయణ రావు చిన్నవాడు కాగా అతని సోదరుల్లో ఒకరైన వెంకట్రావు సింగిల్ విండో లో కార్యదర్శిగా పనిచేసేవాడు. మరో సోదరుడు రామారావు అనారోత్యంతో మరణించగా, తల్లిదండ్రులు కిషన్ రావు, సుశీలమ్, సోదరుడు వెంకట్రావు 20 ఏళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి కరీంననగర్ లో నివాసం ఉంటున్నారు. నారాయణ రావు ఆచూకి కోసం పలుమార్లు పోలీసులు వీరిని ప్రశ్నించడంతో బీర్పూర్ లోని ఇంటిని విక్రయించి కరీంనగర్ లో జీవనం సాగిస్తున్నారని తెలుస్తోంది.