‘‘మలోజ్జుల’’ భార్య తారక్క లొంగుబాటు…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకురాలు, కేంద్ర కమిటీ సభ్యుని సతీమణి జనజీవనంలో కలిశారు. నాలుగు దశాబ్దాలుగా విప్లవ పంథాలో కొనసాగుతున్న ఆమె లొంగిపోవడం సంచలనంగా మారింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం గడ్చిరోలి జిల్లాలో పర్యటిస్తున్న సందర్బంగా 11 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత భార్య తారక్క కూడా ఉండడం గమనార్హం.

మలోజ్జుల భార్య…

కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇంఛార్జిగా  బాధ్యతలు నిర్వర్తిస్తున్న మలోజ్జుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి భార్య తారక్క అలియాస్ విమల సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన తారక్క 1983 నుండి విప్లవ పంథాలో పయనిస్తున్నారు. 170కిపైగా కేసులు ఉన్న ఆమెపై రూ. కోటికి పైగా రివార్డు ఉంది. సిడాం విమల అలియాస్ తారక్క అలియాస్ వత్సల పీపుల్స్ వార్ నుండి వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్నారు. 1986లో గడ్చిరోలి జిల్లా అహేరి LOS మెంబర్ గా, 1987లో పెరిమెలి ఏరియాలో, 1994 నుండి ACM హోదా, LOS కమాండర్ గా పని చేశారు. భామ్రఘడ్ కమాండర్ గా, ఏరియా కమిటీ సెక్రటరీగా, 2006లో్ సౌత్ గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యురాలిగా, 2010 నుండి 9వ కంపెనీలో పని చేసిన ఆమె 2018లో రాహీ ఏరియాలో పని చేశారు. ఇటీవలే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZCM) మెంబర్ గా బాధ్యతలు చేపట్టారు. అలాగే డికె వైద్య బృందానికి ఇంఛార్జీగా కూడా వ్యవహరిస్తున్నారు.

నెల రోజుల క్రితం…

నెల రోజుల క్రితం దండకారణ్య ప్రాంతంలో పని చేస్తున్న మరో ముఖ్యనేత పోలీసుల అదుపులో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. వేణుగోపాల్ సోదరుడు కిషన్ జీ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగింది. అయితే ఇదంతా కూడా పోలీసుల ప్రచారమేనని మావోయిస్టు పార్టీ కొట్టిపారేసింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కూడా కోరింది. అయితే తాజాగా అత్యంత కీలక బాధ్యతల్లో ఉన్న భూపతి భార్య లొంగిపోవడం సంచలనంగా మారింది.

You cannot copy content of this page