40 ఏళ్ల రికార్డ్ బ్రేక్
దిశ దశ, న్యూ ఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేస్తున్నాయి. నిరాటంకంగా పడుతున్న వానతో రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయింది. ఢిల్లీ వాసులు బయటకు వెల్లాలంటేనే వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. గతంలతో పోలిస్తే సీజన్ కురిసే వర్షాల్లో ఇప్పటికే 15 శాతం వానలు పడినట్టయిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తగున్నారు. 1982లో ఈ స్థాయిలో ఢిల్లీ వాసులను వానలు అతలాకుతలం చేయగా, ఆ నాటి రికార్డును ఇప్పుడు పడుతున్న వానలు బ్రేక్ చేశాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నిరంతరంగా పడుతున్న వానతో పాతకాలం నాటి భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఢిల్లీ అధికారులు అప్రమత్తం అయ్యారు. అత్యవసర విభాగాలకు చెందిన శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సెలవులు ఇవ్వకూడదని నిర్ణయించగా, ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారి లీవ్స్ ను రద్దు చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు. తప్పని సరి పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించేందుకు ఆయా శాఖల యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.