హుజురాబాద్ పాలిటిక్స్ లో కీ రోల్…

దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:

హుజురాబాద్ రాజకీయాల్లో తొలిసారి అడుగుపెట్టిన ఆయన ఇప్పుడు సెంటర్ పాయింట్ గా మారిపోయారా..? పొలిటికల్ ఫస్ట్ ఎంట్రీతోనే సినారియో మార్చేస్తున్నారా…? తాతా వారసత్వాన్ని అందిపుచ్చుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన వైపే అందరి దృష్టి పడుతున్నట్టుగా ఉంది.

ప్రణవ్ ఎంట్రీ ఇలా…

హుజురాబాద్ ఎన్నికల తెరపైకి అనూహ్యంగా వచ్చిన వొడితెల రాజేశ్వర్ రావు మనవడు ప్రణవ్ బాబు కాంగ్రెస్ టికెట్ సాధించారు. ఇక్కడి నుండి టికెట్ ఆశించిన నాయకులను తనకు అనుకూలంగా మల్చుకోవడంలో కూడా సక్సెస్ అయిన ప్రణవ్ ఇప్పుడు నియోజకవర్గంలో పట్టు బిగించే పనిలో పడ్డారు. ఐదు మండలాల్లో కూడా తనకంటూ పర్సనల్ క్యాడర్ ను తయారు చేసుకున్న ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ ఎంట్రీతోనే అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఇందు కోసం గ్రౌండ్ వర్క్ చేసుకున్న ప్రణవ్ ఎన్నికల వాతావరణంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

సీనియర్లతో…

ప్రణవ్ బాబు సీనియర్ నేత ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్నారు. కమలాపూర్ నియోజకవర్గం నుండి హుజురాబాద్ వరకు అప్రతిహతంగా గెల్చుకుంటూ వస్తున్న ఈటల రాజేందర్ 2021లో గులాభి పార్టీని వీడాల్సి వచ్చింది. ఈ నేఫథ్యంలో బీజేపీలో చేరిన రాజేందర్ అధికార పార్టీ నేతల ఎత్తులను చిత్తు చేస్తూ గెలిచారు. సానుభూతితో పాటు అధికార పక్షం ఎక్కువగా హుజురాబాద్ పైనే దృష్టి సారించిన తీరుపై కూడా ఇక్కడి ప్రజలకు విరక్తి కలిగింది. మరో వైపున హుజురాబాద్ లో ఓట్టను కొనుగోలు చేసే ప్రక్రియ కూడా సాగుతోందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఈ నేపథ్యంలోనే తమకు డబ్బులు ఇవ్వలేదంటే హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు రొడ్డెక్కి నిరసనలు తెలిపి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా హుజురాబాద్ గురించి చర్చ జరిగిందంటే ఉప ఎన్నికల గురించి ఎంతటి ప్రచారం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో తటస్థులు కూడా ఈటలకు ఓట్లు వేసేందుకు ముందుకు వచ్చి తాము ఓటుకు నోటు తీసుకోలేదంటూ చేతల్లోనే చూపించారు. ఆనాడు నెలకొన్న జరిగిన పరిణామాలన్నింటి ప్రభావం కూడా ఈటల గెలుపునకు దోహదపడిందన్నది వాస్తవం. ఈ సాధారణ ఎన్నికల్లో కూడా రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారు. రాజకీయ వ్యూహాలు, జనం నాడి పట్టుకోవడంలో ధిట్టగా పేరున్న ఈటల రాజేందర్ పై గెలవాలన్న లక్ష్యంతో ప్రణవ్ బాబు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. మరో వైపున అధికార పార్టీ తరుపున పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి కూడా 2018 ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన అనుభవం ఉంది. అయితే ఇద్దరు సీనియర్లతో ప్రణవ్ బాబు పోటీ చేసి ప్రజా క్షేత్రంలో తానేంటో నిరూపించుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.

రెండు పార్టీలకు చెక్…

అయితే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం ప్రణవ్ బాబు వల్ల అటు బీజేపీకి, ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను తనకు అనుకూలంగా మల్చుకుంటున్నట్టుగానే కనిపిస్తున్నది. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులయితే సెకండ్ క్యాడర్ కారు దిగకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితిని ప్రణవ్ బాబు కల్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతామని తేటతెల్లం చేసిన నాయకులతో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడి వారిని బుజ్జగించే బాధ్యతలు తనపై వేసుకున్నారు. ఆయన కారణంగా పార్టీ ఫిరాయింపులు ఆగిపోయినప్పటికీ ఎన్నికలు సమీపించే వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన కనిపిస్తోంది. బీజేపీకి చెందిన క్యాడర్ తో కూడా ప్రణవ్ బాబు టచ్ లోకి వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. రెండు పార్టీల శ్రేణులను తనకు అనుకూలంగా మల్చుకున్నట్టయితే సక్సెస్ అవుతామని గుర్తించిన ప్రణవ్ వర్గం స్పెషల్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఫస్ట్ ఎంట్రీతోనే హుజురాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడం మాత్రం విశేషమనే చెప్పాలి. ఉప ఎన్నికల్లో బోటాబోటి ఓట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఆఈ ఎన్నికల్లో మాత్రం టఫ్ పైట్ ఇచ్చే స్థాయికి చేరడం మాత్రం విశేషం.

You cannot copy content of this page