ఆ అరణ్యంలో మిన్నంటిన రోధనలు…
రక్షించేందుకు పోలీసుల యత్నాలు
దిశ దశ, వరంగల్:
కుండపోతగా కురుస్తున్న వర్షాలు ఎప్పుడు ఏ రహదారిని మూసి వేస్తాయో అంతు చిక్కకుండా పోయింది. వెల్లేప్పుడు సాదా సీదాగా కనిపిస్తున్న వాగులు వంకులు తిరిగి వచ్చేప్పుడు ఉగ్ర రూపంతో ఊరకలెత్తుతున్నాయి. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అయితే టూరిస్టులు మాత్రం పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఉత్సుకత చూపిస్తుండడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ములుగు జిల్లాలో సుమారు 80 మంది వరకు పర్యాటకులు చిక్కుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముత్యాలదార జలపాతం చూసేందుకు వెల్లిన పర్యాటకులు తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో చిక్కుకపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మార్గమధ్యలోని ఓ వాగులో నీటి ప్రవాహం తీవ్రంగా పెరిగిపోవడంతో టూరిస్టులంతా కూడా అక్కడే చిక్కుకుని పోయారు. దీంతో అక్కడి అటవీ ప్రాంతంలో పర్యాటకులు హాహాకారాలు చేస్తు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమను కాపాడండంటూ అరుస్తున్న అరుపులు అరణ్య రోధనే అవుతోంది. ఓ వైపున భారీ వర్షం మరో వైపున కమ్ముకున్న చీకట్లు అసలే అటవీ ప్రాంతం కావడంతో పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ అక్కడే చిక్కుకపోయారు. 100కు డయల్ చేసి టూరిస్టులు తాము చిక్కుకున్నామని తెలిపే వరకూ కూడా వీరంతా ముత్యాల ధారకు వెల్లినట్టుగా బయటకు పొక్కలేదు. ఈ సమాచారం అందుకున్న ములుగు పోలీసులు టూరిస్టులను కాపాడేందుకు ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే చీకటి కావడంతో వారిని కాపాడేందుకు చేసే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.
అటవీ శాఖ హెచ్చరించినా…
ముత్యాలదార జలపాతం సందర్శనను నిషేదించినట్టుగా అటవీ అధికారులు ప్రత్యేకంగా హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ జలపాతం సమీపంలో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగాడే అవకాశం ఉందని, ఈ వాటర్ ఫాల్స్ సమీపంలోని కొండలు ప్రమాదకరంగా ఉన్నందున జలపాతం సందర్శన నిషేధిస్తున్నామని వెంకటాపూర్ డివిజన్ అటవీ అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పర్యాటకులు మాత్రం తమ పంథాన్ని నెగ్గించుకునేందుకే మొగ్గు చూపుతూ చివరకు అక్కడే చిక్కుకపోతున్నారు.
అధికారులు పదే పదే చెప్తున్నా…
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, క్షేత్ర స్థాయిలో పనిచేసే ప్రతి అధికారి వరకూ అధిక వర్షాలు కురుస్తున్నందున ఇండ్ల నుండి బయటకు రాకూడదని పదేపదే హెచ్చరిస్తున్నారు. అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ కూడా అలెర్ట్ చేస్తోంది. అయినప్పటికీ టూరిస్టులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి జలపాతల వద్దకు వెల్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విద్యార్థుల క్షేమాన్ని ఆలోచించి ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తే ప్రమాదకరమైన ప్రాంతాలకు వెల్లేందుకు సాహసించడం విస్మయానికి గురి చేస్తోంది. ఓ వైపున ఎప్పుడు ఏ వాగు పొంగుతుందో అంతుచిక్కని పరిస్థితుల్లో ఇలాంటి దుస్సాహాసాలకు ఒడిగట్టడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.