టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శాపనార్థాలు
దిశ దశ, హైదరాబాద్:
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి మండి పడ్డారు. శుక్రవారం ఈ ఘటనపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. విద్యార్థులు నిరుద్యోగుల ఉసురు తగిలితే సర్వనాశనం అవుతారన్నారు. టీఎస్పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారిందని, పరీక్షల నిర్వహణలో అశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, వందలాది మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయినా కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదంటూ దుయ్యబట్టారు. కేసుతో లింక్ ఉన్న ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్థూపం ముందు ఉరేసినా తప్పులేదని, ఇంత జరిగినా నిరుద్యోగులకు కేటీఆర్ క్షమాపణ చెప్పి పారదర్శక విచారణ చేయిస్తారనుకున్నామన్నారు. కానీ సిట్ తో కేసులు వేయించి తమ విద్యార్థి నాయకులను నిర్బంధించేల వ్యవహరించడం సిగ్గుచేటైన చర్య అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజ్ లో శంకరలక్ష్మి దగ్గర నుండి నేరం మొదలైందని, ఏ1 గా శంకర లక్ష్మిని, ఏ2గా చైర్మన్, సెక్రెటరీలను కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కావాల్సిన వారిని కాపాడి చిన్న ఉద్యోగులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ అంశంపై ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరుగుతోందని టీపీసీసీ చీఫ్ వివరించారు. 420, 120బి సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయి కాబట్టి కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఫిర్యాదు చేశామన్నారు. కేటీఆర్ తో సహా టీఎస్పీఎస్సీ అధికారులందరినీ విచారించాలని కోరినట్టు వెల్లడించారు. కొద్ది మందినే సిట్ విచారిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. పూర్తి సమాచారం సేకరించి విచారణ చేయాలని ఈడీ అధికారులను కోరమని తెలిపారు. జగిత్యాల జిల్లాలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు అందించిన వారు ఎవరని, కటాఫ్ మార్కుల గురించి పరీక్ష రాసిన అభ్యర్థులకే తెలియదని అలాంటప్పుడు కేటీఆర్ కు ఈ విషయాలు ఎలా తెలిశాయో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పరువున్న వారు పరువు నష్టం దావా వేస్తారని ఎద్దేవ చేసిన రేవంత్ రెడ్డి నిజంగా కేటీఆర్ కు పరువు ఉన్నట్టయితే సీబీఐ, ఈడీ అధికారులతో పారదర్శక విచారణకు అదేశాలివ్వాలని, లేనట్టయితే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కోరుతూ లేఖ రాయాలన్నారు. కేటీఆర్ పరువు 100కోట్లని ఎలా నిర్ణయిస్తారో చెప్పాలన్నారు.