రేవంత్ రెడ్డి వైఎస్ సెంటిమెంటును పాలో అవుతున్నారా..?

వైఎస్ కు చేవెళ్ల చెల్లెమ్మ… రేవంత్ కు ములుగు సీతక్క

దిశ దశ, హైదరాబాద్:

ఆడపడుచు సెంటిమెంట్ కు భారతీయులు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతకాదు. తమ కుటుంబంతో సంబంధం లేకపోయిన తమ సోదరి అని అనుకున్న వారి సెంటిమెంట్ విషయంలో కూడా పక్కాగా అమలు చేస్తుంటారు. రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా చూస్తున్న సంగతి తెలిసిందే. సెంటిమెంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాప్ లెవల్లో ఉంటారన్నది వాస్తవం. ఇలాంటి సెంటిమెంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉండేది. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా చేవెళ్ల నుండే ప్రారంభించేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అక్కడి నుండి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి దివంగత ఇంద్రారెడ్డి సతీమణి, ప్రస్తుత తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేవెళ్ల చెల్లెమ్మ అన్న బ్రాండ్ కూడా పడిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర కూడా చేవెళ్ల నుండే స్టార్ట్ చేయడం అది గ్రాండ్ సక్సెస్ అయి 2004లో అధికారంలోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చేవెళ్ల సెంటిమెంట్ విషయంలో వైఎస్ ఏ మాత్రం వెనక్కి తగ్గేవారు కాదని ప్రచారంలో కూడా ఉంది.

రేవంత్ ఇలా…

అయితే ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న రేవంత్ రెడ్డి పలు రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాదయాత్ర కూడా చేపట్టారు రేవంత్ రెడ్డి. ఈ ఏడాది ఫిబ్రవరి 6న రాష్ట్రంలోని 50 నియోజకవర్గాల మీదుగా 60 రోజుల పాటు జరపతలపెట్టిన పాదయాత్రను ములుగు నియోజకవర్గంలోని మేడారం సమ్మక్క సారలక్క గద్దెల నుండి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు చేపట్టనున్న బస్సు యాత్రను కూడా ఇక్కడి నుండే ప్రారంభించాలని షెడ్యూల్ ఫిక్స్ చేశారు. బుధవారం ప్రారంభం కానున్న ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా తయారు చేసే పనిలో ఏఐసీసీ, టీపీసీసీ నాయకులు నిమగ్నం అయ్యారు. రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్రే అయినా, తాజాగా రాహుల్ గాంధీ చేపట్టనున్న బస్సే యాత్రే అయినా ములుగు నియోజకవర్గం నుండే ప్రారంభం చేయాలని నిర్ణయించారు. అగ్రనేతల బస్సు యాత్ర రామప్ప నుండే ప్రారంభించేదుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సమ్మక్క సారలక్కల గద్దెలు వెలిసిన మేడారం అయినా రామప్ప ఆలయం అయినా ములుగు నియోజకవర్గంలోనే ఉండడం ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా సీతక్క ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం. రేవంత్ రెడ్డి కూడా సీతక్క సెంటిమెంట్ ను గట్టిగా నమ్ముతుండడం వల్లే ఆమె నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అనిపిస్తోంది.

ఆమె కూడా…

అయితే సీతక్క కూడా రేవంత్ రెడ్డికి సోదరునిలానే భావిస్తున్నారు. టీడీపీని వీడినప్పుడు కూడా రేవంత్ రెడ్డితోనే కలిసి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా రేవంత్ రెడ్డి తో కలిసే జాయిన్ అయ్యారు ప్రత్యేకంగా ఢిల్లీకి వెల్లి కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీతక్కను ఏఐసీసీ అగ్రనేతల వద్దకు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా సీతక్క ఆయన కోసం భారీ కాన్వాయ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి, సీతక్కలు ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కాకున్నప్పటికీ అన్నా చెల్లెల్ల అనుబంధం మాత్రం నాటుకపోయింది. ప్రతి రాఖీ పౌర్ణిమ సందర్బంగా కూడా సీతక్క రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా రాఖీ కట్టేందుకు వెల్తుంటారు. ఈ సెంటిమెంట్ కారణంగానే రేవంత్ రెడ్డి ములుగు నుండే ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆడపడుచు సెంటిమెంట్ తో ముందుకు సాగుతున్నతెలుగు రాష్ట్రాలలోని ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం మరో విశేషం.

You cannot copy content of this page