సేఫ్ జోన్ లో మావోయిస్టు నేతలు…
దిశ దశ, దంకారణ్యం:
దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి ప్రతికూల పరిస్థితులు తయారు కావడంతో బలగాలు విప్లవ పోరాట ఆనవాళ్లను సమూలంగా పెకిలించివేసే పనిలో నిమగ్నం అయ్యాయి. నక్సల్స్ పెట్టని కోటగా ఉన్న అభూజామఢ్, బస్తర్, మాడ్ ఏరియాల్లో ఏరివేత తీవ్రంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సేఫ్టీ జోన్ కు వెల్లి బలగాల కంటపడకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి తయారైంది. బలగాలు కీకారణ్యాల్లో కూంబింగ్ యథావిధిగా కొనసాగిస్తూ మావోయిస్టు పార్టీ ఆనవాళ్లు కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. క్రాంతికారీ జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మావోయిస్టు పార్టీని ఏరివేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున బలగాలను మోహరించాయి. ఎదురు కాల్పుల ఘటనతో అట్టుడికిపోతున్న దండకారణ్యం ప్రాంతంలో చాలా వరకు నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయడంలో బలగాలు సఫలం అయ్యాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను నిర్వీర్యం చేస్తున్న బలగాలు పోరాటంలో మరణించిన వారి స్మారకార్థం నిర్మించిన స్థూపాలను కూడా తొలగించే పనిలో నిమగ్నం అయ్యాయి. బస్తర్ పూర్వ జిల్లాతో పాటు పలు అటవీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు భారీగా స్మారక స్థూపాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఏటా అమరవీరుల వారోత్సవాలు, పార్టీ ఆవిర్భావోత్సవాలతో పాటు ఎన్ కౌంటర్ ఘటనల్లో చనిపోయిన వారిని స్మరిస్తూ స్మారక స్థూపాలను నిర్మించారు. దండకారణ్యంలో వందల సంఖ్యలో స్మారక స్థూపాలను నిర్మించి ఉంటారని ఓ అంచనా. ఇప్పటికే పలు చోట్ల స్మారక స్థూపాలను కూల్చివేసిన బలగాలు మావోయిస్టుల ఇలాకాలోకి కూడా చొచ్చుకపోయి అక్కడ ఉన్న స్మారక స్థూపాలను కూల్చివేస్తున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లా ఊసుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కంకేర్ సమీపంలో మావోయిస్టులు నిర్మించిన భారీ స్థూపాన్ని బలగాలు కూల్చివేశాయి. 70 ఫీట్ల ఎత్తులో నిర్మించిన ఈ స్థూపంలో ప్రపంచలోనే అతి పెద్ద స్థూపాల్లో ఒకటిగా ఉంటుందేని అంచాన. గతంలో తెలంగాణాలోని హుస్నాబాద్ లో 88 ఫీట్ల ఎత్తులో ఉన్న స్పూపాన్ని అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ నిర్మించారు. ఏసియాలోనే రెండో పెద్ద స్థూపంగా రికార్డుకెక్కిన ఈ స్థూపాన్ని గ్రీన్ టైగర్స్ పేల్చివేశారు.
తెలంగాణాలో…
రెండు దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ పెట్టని కోటగా మల్చుకుని గెరిల్లా యుద్దం సాగించారు. 1989 ఎన్నికల సమయంలో ప్రభుత్వం పీపుల్స్ వార్ నక్సల్స్ కు స్వేచ్ఛ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి అధికారంలోకి రాగానే పీపుల్స్ వార్ పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేశారు. నక్సల్స్ అందిపుచ్చుకున్న ఈ స్వేచ్ఛతో తెలంగాణ పల్లెల్లో విప్లవ భావజాలాన్ని బలంగా వినించారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పీపుల్స్ వార్ అగ్ర నాయకత్వం కూడా బాహ్య ప్రపచంలో తిరిగింది. జనాలతో మమేకమైన పీపుల్స్ వార్ నక్సల్స్ నేతలు వివిధ ప్రాంతాల్లో మరణించిన నక్సల్స్ స్మారకార్థం భారీ ఎత్తున స్థూపాలను నిర్మించారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పై నిషేధం విధించడంతో చాలా ప్రాంతాల్లోని స్థూపాలు కనుమరుగు అయ్యాయి. ఇదే సమయంలో నిర్మించిన హుస్నాబాద్ స్థూపాన్ని గ్రీన్ టైగర్స్ మందుగుండు సామాగ్రి ఉపయోగించి మరీ పేల్చివేశారు. అయితే ఇప్పుడు చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మాత్రం బలగాలే మావోయిస్టు పార్టీ స్థూపాలను కూల్చివేయిస్తున్నాయి. మిషనరీ సాయంతో వాటిని నేలమట్టం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. గతంలో గ్రీన్ టైగర్స్ పేరిట తెలంగాణాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఇప్పుడు దండకారణ్యంలో బలగాలే వాటిని ద్వంసం చేయిస్తున్నాయి. కేంద్ర పారామిలటరీ బలగాలు, స్థానికంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ కమెండోలు అంతా కూడా దండకారణ్య అటవీ ప్రాంతంలోకి వెల్తూ మావోయిస్టు పార్టీ ఆనవాళ్లు కూడా లేకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాయి.