దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల జిల్లాను అధిక వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఓ వైపున ఎస్సారెస్పీ వరద మరో వైపున వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో జిల్లాలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. తెల్లవారు జామునుండి జిల్లా కేంద్రమైన జగిత్యాల నుండి ధర్మపురికి రాకపోకలు నిలిచిపోయాయి. మార్గమధ్యలోని అనంతారం రోడ్ డ్యాం మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహానల రాకపోకలను నిలువరిస్తున్నారు అధికారులు. వరద ఉధృతి తక్కువగానే ఉందన్న ధీమాతో వాహనదారులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇరువైపులా కూడా పోలీసు, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికార బృందాలు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. వరధ నీటి ప్రవాహం కారణంగా వాహనాలు కొట్టుకపోయే ప్రమాదం ఉండడంతో పాటు అప్రోచ్ రోడ్ కూడా కొట్టుకపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో వరధ నీటిని గమనించి వేగంగా వెల్లడం లేదన్న అతి నమ్మకంతో వాహనదారులు వంతెన దాటే ప్రయత్నంలో ప్రమాదాలు సంభవించనున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. వరధ ప్రవాహం పూర్తిగా తగ్గిన తరువాత కానీ వాహనాల రాకపోకలను అనుమతించే అవకాశాలు లేవని తెలుస్తోంది.