భూపాలపల్లిని వెంటాడుతున్న ఎన్ కౌంటర్లు…
పక్షం రోజులు గడవక ముందే… ఇద్దరు నేతల మృతి
దిశ దశ, భూపాలపల్లి:
దండకారణ్య అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎదురు కాల్పుల ఘటనలు భూపాలపల్లి జిల్లా వాసులను ఉలిక్కిపడేస్తున్నాయి. అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయంటే చాలు తమ జిల్లా వాసులెవరైనా ఉన్నారా అన్న ఆందోళన మొదలవుతోంది. జిల్లాకు చెందిన వారు మరికొంతమంది మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నందున వారి స్వగ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు తయారవుతున్నాయి. ఈ ఒక్క నెలలోనే ఇద్దరు ముఖ్య నేతలు కూడా ఈ జిల్లాకు చెందిన వారే చనిపోవడం స్థానికంగా ఆందోళన కల్గిస్తోంది. దీంతో అటు పోలీసులు, ఇటు అజ్ఞాత నక్సల్స్ కుటుంబాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది.
నెల రోజుల్లోనే ఇద్దరు…
భూపాలపల్లి జిల్లాకు చెందిన వారు నేటికీ అజ్ఞాతంలోనే ఉంటూ విప్లవ పోరాటాలు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతమే కాకుండా కీలక బాధ్యతల్లో పనిచేస్తుండడంతో చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయనగా ఎలాంటి దుర్వార్త తమ చెవిన పడుతుందోనన్న ఆందోళన ఆయా కుటుంబాల్లో నెలకొంటోంది. మావోయిస్టుల ఏరివేతలో బలగాలు పెద్ద ఎత్తున మోహరిచండంతో కీకారాణ్యాల్లో తరుచూ ఎన్ కౌంటర్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెలలో జరిగిన ఎదురు కాల్పుల్లో భూపాలపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు చనిపోయారు. ఈ నెల 5న తెలంగాణలోని ములుగు, చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా సరిహధ్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో జిల్లాలోని కాటారం మండలం దస్తగిరిపల్లికి చెందిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ చనిపోయాడు. రెండున్నర దశాబ్దాల క్రితం ఇల్లు విడిచి వెల్లిన సంతోష్ సీఆర్సీసీ 2 కార్యదర్శిగా, స్సెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాడు. కీలక బాధ్యతల్లో ఉన్న సంతోష్ మరణించిన ఘటన ఇంకా జిల్లా వాసులు మరిచిపోకముందే మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపిల్లె సుధాకర్ అలియాస్ శంకర్ చనిపోయినట్టుగా కంకేర్ జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఛోటే భేథియా అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన శంకర్ డీవీసీ కమాండర్ గా పనిచేస్తున్నట్టుగా ప్రకటించారు. వరస ఘటనల్లో జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు మరణించడంతో ఆయా గ్రామాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. దశాబ్దాల క్రితం అడవి బాట పట్టిన వారంతా అక్కడే క్షేమంగా ఉన్నారని ధీమాతో జీవనం సాగిస్తున్న వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యవ్వనంలోకి అడుపెడుతున్న క్రమంలో అడవుల్లోకి వెల్లిన తమ బిడ్డలు శవాలై తిరిగి వస్తున్న తీరుతో కలత చెందుతున్నారు.