ఉరివేసుకున్న ఎస్సై భార్య
తుపాకితో కాల్చుకున్న ఎస్సై
దిశ దశ, వరంగల్:
జనగామ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ భార్య స్వరూప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా కొద్దిసేపటి తరువాత ఎస్సై శ్రీనివాస్ కూడా సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న జనగామ పోలీసులు హుటాహుటిన ఎస్సై శ్రీనివాస్ ఇంటికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఏసీపీ ఆరా తీస్తున్న క్రమంలో…
శ్రీనివాస్ భార్య స్వరూప ఆత్మహత్య చేసుకున్న సమాచారం అందుకున్న స్థానిక ఏసీపీతో పాటు ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీనివాస్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న శ్రీనివాస్ అటాచ్డ్ బాత్ రూంలోకి వెల్లి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ స్వరూపలకు ఇద్దరు మగ సంతానం కలిగారు. ఆరు నెలల క్రితం పెద్ద కొడుకు రవితేజ పెళ్లి జరిగిందని స్థానికులు తెలిపారు. కుటుంబ తగాదాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన స్వరూపను గోదావరిఖనిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ 35 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలె స్టేషన్ ఘన్ పూర్ నుండి జనగామ ఎస్సైగా బదిలీపై వచ్చిన శ్రీనివాస్ గతంలో కూడా ఇదే ఠాణాలో పనిచేసినట్టుగా సమాచారం.
బాత్ రూంలో ఆమె… వాష్ రూంలో భర్త
గురువారం తెల్లవారు జామున ఎస్సై శ్రీనివాస్ భార్య ఇంట్లోని బాత్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, శ్రీనివాస్ వాష్ రూంలోని వెస్ట్రన్ టాయిలెట్ వద్ద తుపాకితో కాల్చుకుని చనిపోయారు. పోలీసు విభాగానికి చెందిన ఎస్సై దంపతులు సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది.