దిశ దశ, మంచిర్యాల:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో దుర్ఘటన చోటు చేసుకుంది. సెల్లార్ పనుల్లో నిమగ్నమైన కూలీలపై పొరుగునే ఉన్న ఖాలీ ప్లేస్ కోసం నిర్మించిన గోడ కూలడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. సంఘటనా వివరాల్లోకి వెల్లే… మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద భవన నిర్మాణంలో భాగంగా సెల్లర్ పనులు చేస్తుండగా పక్కనే ఉన్న మరో స్థలానికి చెందిన ప్రహరీ గోడ కూలి ముగ్గురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరోకరిని గుర్తించిన స్థానికులు శిథిలాల నుండి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. వీరంతా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతనమనేపల్లి మండలానికి చెందిన వారని తెలుస్తోంది. ఉపాధి కోసం మంచిర్యాలకు వలస వచ్చిన వీరు భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. శంకర్, పోషన్నలు మానేపల్లికి చెందిన వారు కాగా హన్మంతు రత్నాపూర్ నివాసిగా స్థానికులు తెలిపారు. భవన నిర్మాణంలో భాగంగా సెల్లార్ లోని ఫిల్లర్ పనుల్లో నిమగ్నమై ఉన్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోలేదా..?
కొత్తగా నిర్మించుకుంటున్న భవనాల యజమానులు ఇరుగు పొరుగున ఉండే నిర్మాణాలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. మునిసిపల్ నిబంధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో నిర్మిస్తున నూతన భవన సెల్లార్ నిర్మాణ పనుల సమయంలో పక్క స్థలానికి సంబంధించిన కంపౌండ్ వాల్ కూలిపోవడానికి సెల్లార్ కోసం తవ్వకాలు జరపడంలో వ్యవహరించిన నిర్లక్ష్యమే అసలు కారణమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భవనం కూడా కమర్షియల్ అవసరాల కోసం మంచిర్యాల మునిసిపల్ కార్యాలయం నుండి అనుమతులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పక్కన ఉన్న నిర్మాణాలకు కొత్తగా నిర్మించే భవనానికి మధ్య గ్యాప్ ఉండే విషయంలో తప్పిదం జరిగిందా లేక నిబంధనల ప్రకారమే నడుచుకున్నారా అన్న విషయంపై కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న వారు మాత్రం ఖచ్చితంగా ఇరుగు పొరుగున ఉండే నిర్మాణాలకు నష్టం వాటిల్లకుండా, ధుమ్ము, ధూళి బయటకు రాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.