చదువు పేరుతో కొన్ని కాలేజీలు విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. మార్కులు ఒక్కటే చాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. మార్కులకు ఇచ్చిన ప్రాధాన్యం.. విద్యార్థి జీవితాలకు ఇవ్వడం లేదు. మార్కుల కోసం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి భరించలేక.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు ఎంత ప్రయత్నించినా అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన సాత్విక్.. నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి మార్కులు సరిగా రావడం లేదని గత కొంతకాలంగా కాలేజీ యాజమాన్యం సాత్విక్‌ను ఒత్తిడికి గురి చేసింది. దీంతో మనస్తాపానికి గురైన సాత్విక్.. మంగళవారం రాత్రి క్లాస్ రూమ్‌లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు.. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఒక్క వాహనం అందుబాటులో లేదని విద్యార్థులు తెలిపారు. రోడ్డుపైకి వెళ్లి లిఫ్ట్ అడిగి సాత్విక్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు.
సాత్విక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం సాత్విక్ కుటుంబానికి సమాచారం అందించినట్లు చెప్పారు. ఆ తర్వాత విద్యార్థి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాలేజీ యాజమాన్యం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, మృతుడి తల్లిదండ్రులు కాలేజీ దగ్గర ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సాత్విక్ ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వార్డెన్లు నరేశ్, జగన్‌తో పాటు మేనేజ్‌మెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.