శవాల నడుమ అన్వేషణ


తనయుడి కోసం తండ్రి వేదన

ఒడిషా రైళ్ల ప్రమాదం మిగిల్చిన విషాదం

దిశ దశ, ఒడిషా:

శుక్రవారం రాత్రి ఒడిషాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. అల్లంత దూరాన ఉన్న వారు కూడా యాక్సిడెంట్ గురించి తెలుసుకుని విషాదంలో కూరుకపోయారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన రైలు ప్రమాదాల్లో ఎక్కువమందిని బలి తీసుకున్న వాటిల్లో శుక్రవారం నాటి బాళేశ్వర్ ఘటన ఒకటి. అయితే ఆ రైళ్లలో ప్రయాణిస్తున్న వారు తమ వారు కాకపోయినా విషాదంలో కొట్టుమిట్టాడుతున్న వారెందరో. ఆ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి కుటుంబ సభ్యులు ఎంతటి దయనీయమైన స్థితికి చేరుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ తమ వారు గాయాల పాలయ్యారా..? విగతజీవులుగా మారారా అన్న విషయంపై అయోమయానికి గురవుతూ ఆందోళనకు గురయ్యే కుటుంబాలు ఎన్నెన్నో. రైలు ప్రయాణంలో జీవనం సాగించే వారిలో ఎక్కువగా సామాన్యులే ఉంటారు. వీరంతా జనరల్ కంపార్ట్ మెంట్లలో ట్రావెల్ చేస్తుంటారు. శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో జనరల్ బోగిల్లో ఎంత మంది ప్రయాణిస్తున్నారన్నది లెక్కలు తేల్చడం కష్టమే. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ట్రావెల్ చేసే జనరల్ కంపార్ట్ మెంట్లలో ఎంతమంది ఉన్నారన్నది గుర్తించడం కూడా రైల్వే అధికారులకు, పోలీసులకు కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ప్రయాణీకుల కుటుంబాల పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పించే ఘటన శనివారం బాలేశ్వర్ ఆసుపత్రిలో పడి ఉన్న శవాల మధ్య సాక్షాత్కరించింది. వరసగా పేర్చి ఉన్న శవాలను దాటుకుంటూ ఓ బక్క పల్చటి వ్యక్తి బాధను దిగమింగుకుంటూ అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రతి మృత దేహం వద్దకు వెల్లి ముఖాన్ని క్షుణ్ణంగా పరిశీలించి… అది తన తనయుడి శవమా కాదా అని గమనిస్తూ ఒక్కొక్క దానిని పరీక్షిస్తున్నారు. ఓ వైపున కళ్లలో నీళ్లు మరో వైపున మనసులో సంఘర్షణతో కొట్టు మిట్టాడుతున్న ఆ తండ్రిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి పలకరించడంతో అతను శవాలను ఎందుకు వెతుకుతున్నాడో తెలిసింది. సుగ్గోకు చెందిన తాను కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న తన కొడుకు కోసం ఆరా తీస్తున్నానని చెప్పి కన్నీటి పర్యంతం అయ్యాడా తండ్రి. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. తనయుడి ఆచూకి కోసం తండ్రి పడుతున్న వేదన చూసి స్థానికులు కంట తడి పెట్టుకున్నారు. ఈ ఘటనలో మూడు రైళ్లు యాక్సిడెంట్ కాగా అందులో వేలాది మంది ప్రయాణిస్తున్న రెండు రైళ్లు ఒక గూడ్స్ ట్రైన్ ఉంది. ఈ రెండు రైళ్లలో అధికార వర్గాలు ప్రాథమికంగా వేసిన అంచనా వేశాయి. కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో 1257 మంది, యశ్వంతాపూర్ లో 1039 మంది ప్రయాణిస్తున్నట్టుగా ప్రాథమికంగా తేల్చారు. అయితే రిజర్వేషన్ తీసుకుని ప్రయాణించే వారి గురించి తెలుసుకోవడం సులువు అవుతుంది కానీ జనరల్ టికెట్లతో ప్రయాణం చేసే వారి ఆచూకి దొరకడం మాత్రం అసాధ్యమేనని చెప్పాలి. అందులో బయలుదేరిన వారు తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తే తప్ప వారు ఏ ట్రైన్ లో ఉన్నారో తెలిసే అవకాశం ఉండదు. సుగ్గోకు చెందిన ఈ తండ్రి పడుతున్న వేదనలాగా ఎంతమంది సామాన్యులు ఈ విధంగా మదనపడిపోతున్నారని అంచనా వేద్దామంటే ఊహలకు కూడా అందదేమో. అయితే మృత దేహాల్లో తమ వారు లేరని నిర్దారించుకున్నా వారి ఆచూకి కోసం వెతుకుతూనే ఉంటారు. విగత జీవిగా మారిపోయిన వారి కుటుంబాలేమే తమ వాడు కానరాని లోకాలకు వెల్లిపోయాడని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటారు. అయితే కుప్పలు తెప్పులుగా పడి ఉన్న ఆ శవాల్లో తమ కుటుంబ సభ్యుల ఆచూకి దొరకక, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లోనూ వారు కనిపించకపోతే తల్లడిల్లిపోయే వారెందరో. ఒడిషా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదంలో కొట్టుమిట్టాడే కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతమే.

You cannot copy content of this page