రాఖీ కట్టిన సోదరి శవమై కనిపించి… తాళి కట్టాల్సిన వరుడు కాటికి చేరి…

దిశ దశ, ఏపీ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ దుర్ఘటనలో 18 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో తీరు విషాదమే అల్లుకుని ఉంది. సోదరులపై అభిమానంతో రాఖీ కట్టేందుకు వెల్లిన సోదరి మరో రెండు మూడు రోజుల పాటు ఉండాలని వేడుకున్నా వినకుండా డ్యూటీలో చేరాల్సిందేనని వెల్లి ప్రాణాలు కోల్పోయింది ఒకరు అయితే… మరో 40 రోజుల్లో వివాహం జరుపుకోవల్సిన యువకుడు కూడా కానరాని లోకాలకు చేరాడు.

హరిక అనే రసాయన శాస్త్రవేత్త రాఖీ పండగ కోసం తన స్వస్థలమైన కాకినాడకు వెళ్లి వేడుక జరుపుకున్నారు. అనంతరం తిరిగి డ్యూటీకి వెళ్లేందుకు సిద్దమైన హరికను కుటుంబ సభ్యులు వారించినా వినలేదు. మరో రెండు మూడు రోజులు ఉండాలని అభ్యర్థించినా ఫ్యాక్టరీలో సెలవు దొరకలేదని, ఖచ్చితంగా విధుల్లో చేరాల్సిందేనని వెల్లిపోయారు. బుధవారం జరిగిన ప్రమాదంలో హరిక తనువు చాలించిందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమతో పాటు మరో రెండు మూడు రోజులు ఉండాలని కోరినప్పుడు ఆగిపోయినా ప్రాణాలతో తమ కళ్లముందు ఉండేదంటూ రోధిస్తున్న ఆమె కుటుంబ సభ్యులను నిలువరించలేకపోతున్నారు. తాము క్షేమంగా ఉండాలని కోరుకుంటూ రాఖి కట్టిన సోదరి తిరిగి రాని లోకాలకు చేరుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సోమవారం నాడు తమతో నవ్వుకుంటూ వేడుకలో పాల్గొందని రెండు రోజుల్లోనే విగత జీవిగా మారిపోయిందని హరిక కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మండలానికి చెందిన ఐటీఐ డిప్లోమా చేసిన పార్థసారథి కుటుంబంలోనూ అచ్చుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం  విషాదాన్ని నింపింది. మరో 40 రోజుల్లో పార్థసారథి వివాహం జరగనున్న నేపథ్యంలో అతని పెళ్లి ఘనంగా జరపాలని కుటుంబ సభ్యులు కలలు కన్నారు. వివాహ ఏర్పాట్లలో నిమగ్నమైన ఇరు కుటుంబాలు ప్రమాదంలో పార్థ సారథి మరణించాడన్న సమాచారం అందుకోగానే హతాశులయ్యారు. ఉద్యోగం దొరికింది కదా వివాహం చేసినట్టయితే పిల్లపాపలతో పార్థసారథి చిరకాలం సుఖ సంతోషాలతో కాలం వెల్లదీస్తాడునుకుంటూ కలలు కన్న ఆ కుటుంబం సభ్యులు అతను మరణించాడన్న విషయం తెలయడంతో కోలుకోలేకపోతున్నారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన తమ బిడ్డ తమ కళ్ల ముందే విగతజీవిగా మారిపోయాడంటూ ఏడుస్తున్న ఆ తల్లిదండ్రులను ఆఫడం ఎవరితరమూ కావడం లేదు.

You cannot copy content of this page