తగ్గేదేలే అంటున్న ట్రాన్స్ కో…

ఏసీడీ ఛార్జీల వసూళ్లకు రంగం సిద్దం

దిశ దశ, కరీంనగర్:

అడిషనల్ కన్జ్యూమర్ డిపాజిట్ (ఏసీడీ) ఛార్జీల వసూళ్లకు రంగం సిద్దమైంది. గత డిసెంబర్ నుండే విద్యుత్ వినియోగదారుల నుండి వసూలు చేయాల్సిన ఈ ఛార్జీలను ప్రతిపక్ష పార్టీలతో పాటు వినియోగదారుల నుండి కూడా వ్యతిరేకత మొదలు కావడంతో తాత్కాలికంగా వసూళ్లను నిలిపివేసిన ట్రాన్స్ కో తాజాగా ఏసీడీ ఛార్జీలు చెల్లించని వారికి నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకు సంబంధించిన నోటీసులు కూడా సిద్దం చేయడంతో నేడో రేపో ఏసీడీ ఛార్జీలు చెల్లించని వినియోగదారులకు అందనున్నాయి. నోటీసులు పంపించిన తరువాతా ప్రతి నెల ఇచ్చే విద్యుత్ వినియోగ బిల్లులోనే ఏసీడీ ఛార్జీలను కలిపి పంపించనున్నారు. వాస్తవంగా ఈ ఛార్జీలను ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ గత డిసెంబర్ నెలలో ఇచ్చిన ఏసీడీ ఛార్జీలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినయోగదారులను ముప్పు తిప్పలు పెడుతోందని అడ్డగోలుగా ఏసీడీ ఛార్జీలు వసూలు చేస్తోందంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా మండిపడ్డారు. దీంతో ట్రాన్స్ కో అధికారులు ఏసీడీ ఛార్జీల వసూళ్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు వేశారు. ఏసీడీ ఛార్జీలు చెల్లించని వినియోగదారుల నుండి వసూలు చేయాలని భావిస్తున్న ట్రాన్స్ కో ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఏటా వినియోగించే విద్యుత్ ను బట్టి ఏసీడీ ఛార్జీలను వసూలు చేస్తుంటారని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీడీ ఛార్జీలు చెల్లించని కన్జ్యూమర్లకు డిమాండ్ నోటీసులు పంపిచనున్నట్టు సమాచారం. అలాగే ఏటా అడిషనల్ కన్జ్యూమర్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని, ఆ ఏడాది వినియోగదారులు వాడుకున్న విద్యుత్ ను బట్టి ఈ ఛార్జీలను ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. విద్యుత్ వినియోగాన్ని బట్టి ప్రతి డిసెంబర్ లో ఈ ఛార్జీలకు సంబంధించిన ప్రక్రియ రోటీన్ గా సాగుతూనే ఉంటుందని సమాచారం. ఈ సారి గత డిసెంబర్ నుండి వసూలు చేయాల్సిన ఏసీడీ ఛార్జీలు జూన్ నాటికల్లా వసూలు చేసి, తిరిగి డిసెంబర్ లో 2023 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ వినియోగ వివరాల ఆధారంగా అదనపు ఛార్జీల వసూళ్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుందని స్పష్టమవుతోంది.

You cannot copy content of this page