‘కిచెన్’ నుండే లావాదేవీలు..?

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న విషయాలు సంచలనంగా మారాయి. ఆ సమయంలో పెట్టుకున్న కోడ్ బాష గురించి వింటున్న వారంతా ఆశ్యర్యపోతున్నారు. సెంట్రలైజ్డ్ ఆఫీసుకు అనుభందంగా ట్యాపింగ్ సమాచారం బయటకు చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ప్రైవేటు బ్రాంచ్ ఆఫీసులకు ప్రత్యేకంగా పేర్లు పెట్టారని తెలుస్తోంది. అందులో కీలకంగా ఉపయోగపడిన ఓ సీక్రెట్ డెన్ పేరు ‘కిచెన్’ అని సంబోధించేవారని ప్రచారం జరుగుతోంది. వీటి ద్వారానే కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా సమాచారం. టీ, టిఫిన్,మీల్స్ ఇలా పలు రకాల కోడ్ బాషలు ఏర్పాటు చేసుకుని వాటికి అనుగుణంగా ఆర్థిక వనరుల బదిలీ చేసినట్టుగా కూడా పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లోని ఎస్ఐబి కేంద్ర కార్యాలయానికి అనుభందంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ బ్యాంచ్ కార్యాలయాలకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన రికార్డులు చేరవేసి అక్కడి నుండి ఆ సమాచారానికి సంబంధించిన వారికి పంపించే వారని పోలీసు వర్గాలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కోడ్ బాషాను డీకోడ్ చేసేందుకు కూడా పోలీసు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.

సిట్… సీఐడీ…

మరో వైపున ఫోన్ ట్యాపింగ్, సాక్ష్యాల తారుమారు అంశాలకు సంబంధించిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దర్యాప్తు బాధ్యతలు ప్రత్యేక విభాగానికి అప్పగించాలన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా సిట్ వేయడమా లేక సీఐడీకి బాధ్యతలు అప్పగించడమా అన్న విషయంపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే గతంలో చాలా వ్యవహారాల్లో సిట్ ఏర్పాటు చేసినప్పటికీ దర్యాప్తు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని సీఐడీకి బదిలీ చేస్తే ఈ విబాగానికి చెందిన స్పెషల్ టీమ్ ఎక్కడికైనా వెల్లి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉండడంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా రప్పించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో సిట్ ఏర్పాటు చేయడం కంటే సీఐడీకి బదిలీ చేయడమే బెటర్ అన్న భావనకు అధికారులు వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ విషయాలన్నింటికి సంబంధించిన నివేదికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఉంచాలని ఆయన ఆదేశాలను బట్టి ఇన్వెస్టిగేషన్ జరిపించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపున ట్యాపింగ్ వ్యవహారంలో 30 నుండి 40 మంది పోలీసు అధికారుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టుగా సమాచారం.

You cannot copy content of this page