దిశ దశ, జగిత్యాల:
ఆడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఎక్సైజ్ సీఐపై బదిలీ వేటు వేసిన ఎక్సైజ్ అధికారులు మిగతా అంశాలపై కూడా విచారణ చేస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి ఎక్సైజ్ సీఐ రాధ ఓ బార్ అండ్ రెస్టారెంట్ ప్రతినిధితో మాట్లాడిన ఆడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఆడియోల విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆమెను ఎక్సైజ్ కమిషనర్ వద్ద రిపోర్ట్ చేయాలన్న ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆమె ఓ బెల్టు షాపును మూసేయాలని వార్నింగ్ ఇచ్చిన తరువాత బార్ అండ్ రెస్టారెంట్ ప్రతినిధి సీఐ రాధకు కాల్ చేసి మాట్లాడారు. అయితే ఈ సందర్బంగా పలు అంశాల గురించి ఈ ఆడియోల్లో ప్రస్తావనకు వచ్చాయి. అధికారులు మాత్ర సీఐ రాధను బదిలీ చేసి సరిపుచ్చుతారా లేక అక్రమ వ్యవహారాలకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా కఠినంగా వ్యవహరిస్తారా అన్నదే పజిల్ గా మారింది. రాష్ట్ర ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కూడా బెల్ట్ షాపులను ఎత్తివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆడియోల్లో బెల్ట్ షాపులు ఇంకా నడుస్తున్నాయని తేటతెల్లం అయినందున వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా బార్ అండ్ రెస్టారెంట్లు కూడా బెల్ట్ షాపులు నిర్వహించడం ఎక్సైజ్ నిభందనలకు పూర్తి విరుద్దం అయినందున సదరు బార్ అండ్ రెస్టారెంట్ పై కూడా చర్యలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాకుండా బెల్టు షాపుల విషయంలో అధికారులకు మామూళ్ల ఇచ్చే అంశం గురించి కూడా ఈ ఆడియోల్లో చర్చ జరిగింది. అయితే ఈ అంశంపై కూడా అధికారులు విచారణ జరిపి బాధ్యులైన ఇతర అధికారులపై వేటు వేస్తారా అన్న విషయంపై కూడా స్థానికంగా చర్చ సాగుతోంది. ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న విషయం తేలాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే.