తెలంగాణలో ట్రాన్స్ జెండర్ పోటీ…

బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న పుష్పిత లయ

వరంగల్ తూర్పు నుండి పోటీ

దిశ దశ, వరంగల్:

రాష్ట్రంలో తొలిసారి అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ చరిత్ర క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రికార్డును కూడా బీఎస్పీ సొంతం చేసుకుంది. ఓ ట్రాన్స్ జెండర్ కు టికెట్ ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకుంది. సోమవారం విడుదల చేసిన రెండో జాబితాలో ట్రాన్స్ జెండర్ కు అవకాశం కల్పించినట్టుగా బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి చిత్రపు పుష్పిత లయను బరిలోకి దింపుతున్నామని ప్రకటించారు. ట్రాన్స్ జెండర్లుగా తమ ఓటు హక్కు కల్పించేందుకు వారికి ప్రత్యేక కాలమ్ ను ఎన్నికల కమిషన్ ఈవీఎంలలో చేర్చింది. ఓటరు జాబితాలో కూడా స్త్రీ, పురుష, ట్రాన్స్ జెండర్లకు సంబంధించిన వివరాలు కూడా చేర్చే ఆనవాయితీకి శ్రీకారం చుట్టింది. అయితే ఇందులో భాగంగా తొలిసారి 2021లో హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణకు చెందిన ట్రాన్స్ జెండర్ తొలి ఓటరుగా తమ పేరును నమోదు చేసుకున్నారు. తాజాగా వరంగల్ తూర్పు నుండి పుష్పిత లయ పోటీ చేస్తున్న ట్రాన్స్ జెండర్ గా రికార్డుల్లోకి ఎక్కారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించకపోగా బీఎస్పీ మాత్రం వారికి ఓ స్థానాన్ని కెటాయించడం విశేషం. ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలన్న తలంపుతోనే బీఎస్పీ అభ్యర్థిగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పుష్పిత లయ గెలుపు బాటలో పయనించేందుకు ప్రచారం ఎలా సాగించబోతారు, తూర్పు ఓటర్లు ఎంతమేర ఆదరిస్తారో అన్న విషయం తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

గతంలో…

2018లో గోషామహల్ నుండి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుండి చంద్రముఖి అనే ట్రాన్స్ జెండర్ బరిలో నిలవగా ఆమె కిడ్నాప్ నకు గురి కావడం సంచలనం సృష్టించింది. ఆమెను కావాలనే కిడ్నాప్ చేశారంటూ ఆందోళనలకు కూడా వ్యక్తం అయ్యాయి.

You cannot copy content of this page