దిశ దశ, హైదరాబాద్:
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలను నిలిపివేయగానే సార్ అని పిలుస్తూ చేతులు చాచి అభ్యర్థించే పద్దతికి ఇక చెక్ పడనుంది. తమ కడుపు నింపుకునేందుకు బిక్షాటన చేస్తున్న ఆ చేతులే వాహనాలను నియంత్రించబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో ట్రాన్స్ జెండర్లకు కొత్త ఉపాధి మార్గాన్ని చూపించబోతోంది. హైదరాబాద్ నగర వాసులను అనుక్షణం వెంటాడుతున్న ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ట్రాఫిక్ అవాంతరాలను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుందోనన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. నగరంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లను నియమించాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మహా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులతో పాటు హోం గార్డ్స్ కూడా విధుల్లో నిమగ్నమై పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం ట్రాన్స్ జెండర్ల సేవలను కూడా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పది రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వాహనాల నియంత్రణ కోసం ట్రాన్స్ జెండర్లను వలంటీర్లుగా నియమించాలన్నారు. స్టైఫండ్ కూడా ఇవ్వాలని దీనివల్ల వారికి కొంతమేర ఉపాధి కల్పించినట్టు అవుతుందన్నారు. హోంగార్డ్స్ ను వినియోగించుకున్న విధంగానే ట్రాన్స్ జెండర్ల సేవలను కూడా ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం అందుబాటులోకి తెచ్చినట్టయితే బావుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ఆసక్తి ఉన్న ట్రాన్స్ జెండర్ల వివరాలను సేకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వారి కోసం ప్రత్యేకంగా యూనిపామ్స్ డిజైన్లను కూడా సిద్ద చేశారు.