ఆ పార్కు పేరు మార్పు…. ‘పొన్నం’ సంచలన నిర్ణయం

దిశ దశ, కరీంనగర్:

నిన్న మొన్నటి వరకు గుత్తాధిపత్యం చెలాయించిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా ఝులిపించే పనిలో నిమగ్నం అయింది. సర్కారు తమ చేతిలో ఉందన్న ధీమాతో ఇష్టారీతిన వ్యవహరించిన తీరుపై అప్పుడే వ్యతిరేకత వెల్లడైంది. అయితే ప్రభుత్వం ఆ పెద్దల చేతుల్లో ఉందన్న కారణంగా ఏమీ చేయలేక మదనపడిపోయారు చాలామంది. ప్రభుత్వ విభాగాల్లో పెత్తనం చేసిన కొంతమంది సర్కారు అధికారులు తమకు అనుకూల నిర్ణయాలు అమలయ్యే విధంగా పావులు కదిపారు. ప్రభుత్వ నిధులే అయినా వారి సొంత ఆస్థిని వెచ్చించినట్టుగా తమ పూర్వీకుల పేర్లు పెట్టుకునేందుకు కూడా వెనకాడలేదు కొంతమంది అధికారులు. సరిగ్గా ఈ కోవలోకే వస్తుంది తిమ్మాపూర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కార్యాలయంలోని చిల్డ్రన్స్ అవేర్ నెస్ పార్క్.  2019లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పార్కుకు కృష్ణమనేని వెంకట్రామారావు ట్రాఫిక్ అవేర్ నెస్ అని పేరు పెడుతూ జిఓ ఎంఎంస్ నంబర్ 13, తేది 21.06.2019న జారీ చేశారు. రవాణా శాఖలో పట్టుబిగించిన ఓ అధికారి కారణంగానే ఈ జీఓ విడుదల అయినట్టుగా ఆరోపణలు వచ్చాయి. రవాణా శాఖలో కూడా ఈ పేరు పెట్టడం పట్ల విస్మయం వ్యక్తం అయినప్పటికీ ఆ అధికారి ప్రభుత్వం పెద్దలకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఎవరూ కూడా కిమ్మనలేదు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్క్ పేరును మారుస్తూ మరో జీఓను విడుదల చేసింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ఇటీవల కరీంనగర్ పర్యటించినప్పుడే పార్క్ పేరు మార్చాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి పేరిట పార్క్ ఉండడం సరికాదని, రవాణా శాఖ అధికారులే ఈ పార్క్ పేరు పెట్టినట్టయితే 24 గంటల్లో తొలగించాలని, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టయితే ఆ జీఓను తనకు పంపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మరి మార్పిస్తానని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన జీఓ కాపీని సేకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు విషయాన్ని వివరించారు. కరీంనగర్ జిల్లాలోనే అత్యంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న జువ్వాడి చొక్కారావు లాంటి యోధుల పేర్లను విస్మరించారని, ఆయన పేరిట ఈ పార్క్ పేరును మార్చాలని కోరారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చిల్డ్రన్స్ అవేర్ నెస్ పార్కు పేరును ‘‘జువ్వాడి చొక్కారావు ట్రాఫిక్ అవేరె నెస్ పార్క్’’ గా మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. జిఓ ఎంఎంస్ నంబర్ 1 తేది 09.01.2024న ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో ఇక నుండి ఈ పార్కును జువ్వాడి చొక్కారావు పార్కుగా పేరు మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

You cannot copy content of this page